మా పతకాలు గంగలో వేస్తాం.. ఇండియా గేట్ వద్ద నిరాహార దీక్షకు దిగుతాం: రెజ్లర్లు

By Mahesh KFirst Published May 30, 2023, 1:50 PM IST
Highlights

డబ్ల్యూఎఫ్ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై లైంగిక ఆరోపణలు చేసి, ఆయన పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నూతన పార్లమెంటు ముందు పంచాయతీ కార్యక్రమానికి నిరసనలు చేస్తున్న మల్లయోధులు వెళ్లుతుండగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆ తర్వాత జంతర్ మంతర్ వద్ద వారి నిరసన వేదికను పోలీసులు తొలగించారు. ఈ నేపథ్యంలో రెజ్లర్లు తమ నిరసన ప్రణాళికను వెల్లడించారు.
 

న్యూఢిల్లీ: మన దేశ టాప్ రెజ్లర్లు నిరసనను తీవ్రతరం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో నూతన పార్లమెంటుకు కూతవేటు దూరంలోని జంతర్ మంతర్ వద్ద వారి నిరసన వేదికను పోలీసులు తొలగించారు. దీంతో వారు వారి నిరసన ప్రణాళికను మార్చుకున్నారు. వారు సాధించిన పతకాలను గంగలో వేస్తామని తెలిపారు. ఆ తర్వాత ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద నిరవధిక నిరాహార దీక్షకు దిగుతామని ప్రకటించారు.

మల్ల యోధురాలు సాక్షి మాలిక్ తమ తదుపరి కార్యచరణను ట్విట్టర్‌లో వెల్లడించారు. తామంతా హరిద్వార్‌కు వెళ్లుతామని, అక్కడే ఈ రోజు గంగా నదిలో సాయంత్రం 6 గంటలకు తమ పతకాలను గంగలో నిమజ్జనం చేస్తామని తెలిపారు. ‘ఈ మెడల్సే మా జీవితాలు, మా ఆత్మ. వాటిని ఈ రోజు గంగలో పడేశాక మేం జీవించడానికి విలువే లేదు. కాబట్టి ఆ తర్వాత మేం ఇండియా గేట్ వద్ద నిరవధిక నిరాహార దీక్షకు కూర్చుంటాం’ అని హిందీలో ఓ ప్రకటన చేశారు.

🙏 pic.twitter.com/wdMCzeADEo

— Sakshee Malikkh (@SakshiMalik)

భారత రెజ్లింగ్ ఫెడరేషన్ సమాఖ్య చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా, ఇతర మల్ల యోధులు గత నెల రోజులుగా నిరసనలు చేస్తున్నారు. ఒక మైనర్ సహా పలువురు మహిళా రెజ్లర్లపై బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడినట్టు వారు ఆరోపించారు. ఆయనను డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ పదవి నుంచి తొలగించడమే కాదు.. ఎంపీగానూ అనర్హుడిని చేయాలని, అరెస్టు చేసి ఈ ఆరోపణలపై దర్యాప్తు చేయాలని ఈ రెజ్లర్లు డిమాండ్ చేస్తున్నారు.

Also Read: Delhi murder: చంపినందుకు పశ్చాత్తాపమేమీ లేదు, 15 రోజుల క్రితమే మర్డర్ ప్లాన్: ఢిల్లీ పోలీసులు

ఏప్రిల్ 23వ తేదీ నుంచి జంతర్ మంతర్ వద్ద వారు నిరసనలు చేస్తున్నారు. నూతన పార్లమెంటు ప్రారంభోత్సవం రోజే అంటే మే 28వ తేదీనే వారు నూతన పార్లమెంటు భవనం ఎదుట మహిళా మహా పంచాయత్ నిర్వహణకు రెజ్లర్లు ప్లాన్ వేశారు. కానీ, అందుకు పోలీసులు అనుమతించలేదు. అయినా, వారు ముందుకు కదలడంతో పోలీసులు ప్రతిఘటించారు. వారిపట్ల దురుసుగా వ్యవహరించారు. ఈడ్చుకెళ్లి పోలీసు వాహనాల్లో వేశారు. ఢిల్లీలోని వసంత్ విహార్ సహా పలు పోలీసు స్టేషన్‌లలో వారిని కస్టడీలో ఉంచుకున్నారు. ఈ సందర్భంగా కొన్ని హృద్యమైన విజువల్స్ బయటకు వచ్చాయి. సోషల్ మీడియాలో ముఖ్యంగా వినేశ్ ఫోగట్ ఫొటో వైరల్ అయింది. 

అంతేకాదు, తాము అనుమతించకున్నా.. నూతన పార్లమెంటు వైపు కదిలారని, నిబంధనలు ఉల్లంఘించినందున వారిని జంతర్ మంతర్ వద్ద నిరసన చేయడానికి అనుమతించబోమని ఢిల్లీ పోలీసులు తెలిపారు. వారి నిరసన వేదికను తొలగించారు. రెజ్లర్లపై ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేశారు.

శాంతియుతంగా తాము నిరసన చేస్తుంటే పోలీసులు కఠినంగా వ్యవహరించారని సాక్షి మాలిక్ ఆ తర్వాత పేర్కొన్నారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న డబ్ల్యూఎఫ్ఐ చీఫ్‌పై కేసు నమోదు చేయడానికి వారం రోజులు పట్టిందని, అదే శాంతియుతంగా నిరసన చేస్తున్న తమపై కేసు నమోదు చేయడానికి ఏడు గంటల సమయం కూడా పట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

తాజాగా, ఈ రెజ్లర్లు తమ నిరసన కార్యచరణను ప్రకటించారు.

click me!