
భారత్‌లో గత కొంతకాలంగా డిజిటల్ చెల్లింపులు పెరిగిన సంగతి తెలిసిందే. మెట్రో నగరాలలో ఎక్కువగా క్రెడిట్, డెబిట్, యూపీఐల ద్వారానే వినియోగదారులు చెల్లింపులు చేస్తున్నారు. అయితే తాజాగా డెబిట్, క్రెడిట్, యూపీఐ ద్వారా చెల్లించే వారికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ హెచ్చరిక జారీ చేసింది. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలోని సైబర్ దోస్త్ ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేయబడిన ఫోటో.. ఢిల్లీలోని వసంత్ కుంజ్‌లో ఉన్న డీఎల్‌ఎఫ్ మాల్‌లోని అడిడాస్ స్టోర్ అని చెప్పబడింది. ఆ ఫోటోను గమనిస్తే.. స్టోర్‌లో పీవోఎస్ మెషిన్ పైభాగంలోనే సీసీ కెమెరా ఫిక్స్ చేసింది.
ఈ ఫోటోను పరిశీలిస్తే.. కెమెరా కొనుగోలుదారు క్రెడిట్, డెబిట్ చెల్లింపులు జరిపినప్పుడు పిన్‌ను రికార్డ్ చేయగలదని.. తద్వారా ఆ వివరాలు దొంగిలించబడే ప్రమాదం ఉందని అర్థం చేసుకోవచ్చు. ఇక, డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా బ్యాంక్ ఖాతా నుండి డబ్బును విత్‌డ్రా చేయడానికి పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబర్( పిన్) కీలకమనే సంగతి తెలిసిందే.
కేంద్ర హోం శాఖ ఫొటోను షేర్ చేయడంతో పాటు.. ప్రజలు తమ పిన్‌ను భద్రంగా ఉంచుకోవాలని హెచ్చరించింది. ‘‘మీ డబ్బును ఆదా చేయడానికి మీ పిన్‌ను రక్షించుకోండి. పీవోఎస్ లేదా ఏటీమ్ మెషీన్‌లలో పిన్ లేదా ఓటీపీని నమోదు చేయడానికి ముందు.. చుట్టుపక్కల కెమెరాలను చూడండి. ఢిల్లీలోని వసంత్ కుంజ్‌లోని డీఎల్ఎఫ్ మాల్‌లో అడిడాస్ స్టోర్‌లో బిల్లింగ్ కౌంటర్‌పై ఒక కెమెరా ఉంది’’ అని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఇదిలా ఉంటే.. దేశంలో ఓ వైపు డిజిటల్ చెల్లింపులు పెరుగుతుంటే.. మరోవైపు సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయి. మొత్తం మీద 2021లో 52,974 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) నుండి అందుబాటులో ఉన్న తాజా డేటా తెలియజేస్తుంది.