
Prophet Row: మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యల వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఇప్పటికే ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో హింసాత్మక ప్రదర్శనలు జరిగాయి. తాజాగా జార్ఖండ్‌లోని రాంచీలో జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ హింసాత్మక ప్రదర్శనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు.
హింసాత్మక ప్రదర్శన
జూన్ 10 శుక్రవారం నాడు.. బిజెపి అధికార ప్రతినిధి నుపుర్ శర్మ ప్రకటనపై ఆగ్రహించిన ప్రజలు రాజధాని రాంచీలోని ప్రధాన రహదారిపై నిరసన తెలిపారు. సస్పెండైన బిజెపి నేతలు నుపూర్ శర్మను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నవీన్ జిందాల్, నుపూర్ శర్మకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో ప్రదర్శనలు క్రమంగా హింసాత్మకంగా మారింది.
నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించగా.. నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వడంతో.. పలువురు పోలీసులు గాయపడ్డారు. వారిని నిలువరించేందుకు పోలీసులు ఏరియల్ ఫైరింగ్ ప్రారంభించారు. దీంతో నిరసనకారులు అదుపులోకి వచ్చారు. అయితే.. ఘటనలో ఇద్దరు వ్యక్తులకు బులెట్లు తాకి మరణించారు.
బుల్లెట్ గాయాలతో మరణించిన వారిలో ఒకరిని మహ్మద్ షాహిద్ గా గుర్తించారు. అదే సమయంలో.. ఈ హింసలో గాయపడిన రాంచీ SP కూడా ఆసుపత్రిలో చేరారు. ఆయన స్థానంలో డీఎస్పీ అన్షుమన్ బాధ్యతలు చేపట్టారు. ఈ ఘర్షణల్లో పలువురు గాయపడగా... ఆసుపత్రికి తరలించిన వారిలో ఇద్దరు చనిపోయినట్లు రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్) అధికారులు ధ్రువీకరించారు. 10 మందికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం తలెత్తిన ఉద్రిక్తతలతో రాంచీలో పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా బలగాలను మోహరించారు.
మహ్మద్ ప్రవక్త గురించి నూపూర్ శర్మ చేసిన ప్రకటన తర్వాత, దేశవ్యాప్తంగా ప్రదర్శనలు జరుగుతున్నాయి. శుక్రవారం ప్రార్థనల అనంతరం దేశంలోని పలు నగరాల్లో నిరసన ప్రదర్శనలు జరగాయి. ఈ క్రమంలో పలు చోట్ల హింసాత్మక ఘటనలు చెలరేగాయి. ఈ సందర్భంగా పలువురు గాయపడ్డారు. యూపీలో చాలా చోట్ల ఇలాంటి హింసాత్మక ప్రదర్శనలు కనిపించాయి. ఇందులో ఇప్పటి వరకు 136 మందిని అరెస్టు చేయగా.. మిగిలిన వారిని గుర్తిస్తున్నారు. కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం యోగి ఆదేశాలు జారీ చేశారు.