దేశంలో వ్యాక్సిన్ కొరత లేదు.. సమస్య ఇక్కడే: రాష్ట్రాలకు కేంద్రం చురకలు

By Siva KodatiFirst Published Apr 13, 2021, 8:25 PM IST
Highlights

వ్యాక్సిన్ కొరతపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వివరణ ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రాల వద్ద 1.67 కోట్ల వ్యాక్సిన్‌ డోస్‌ల నిల్వ ఉందని వెల్లడించింది. సమస్య వ్యాక్సిన్‌ కొరత కాదని, రాష్ట్రాలకు సరైన ప్రణాళిక లేకపోవడమేనంటూ చురకలంటించింది.  

కరోనా వైరస్ సెకండ్ వేవ్‌తో భారతదేశం వణికిపోతోంది. వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పలు చోట్ల లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ వంటి మార్గాల ద్వారా మహమ్మారిని అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే రాష్ట్ర ప్రభుత్వాలను వ్యాక్సిన్‌ కొరత తీవ్రంగా వేధిస్తోంది. చాలా చోట్ల ‘వ్యాక్సిన్‌ అందుబాటులో లేదు’ అంటూ ఆస్పత్రుల వద్ద బోర్డులు దర్శనమిస్తున్నాయి. రాష్ట్రాలు సైతం వ్యాక్సిన్‌ సరఫరాను పెంచాలని కేంద్రానికి లేఖలు రాస్తున్నాయి.

వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ప్రధాని మోడీ దృష్టికి ముఖ్యమంత్రులు సైతం ఈ విషయాన్ని తీసుకొచ్చారు. అయితే వ్యాక్సిన్ కొరతపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వివరణ ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రాల వద్ద 1.67 కోట్ల వ్యాక్సిన్‌ డోస్‌ల నిల్వ ఉందని వెల్లడించింది. సమస్య వ్యాక్సిన్‌ కొరత కాదని, రాష్ట్రాలకు సరైన ప్రణాళిక లేకపోవడమేనంటూ చురకలంటించింది.  

Also Read:గుడ్‌న్యూస్: విదేశీ వ్యాక్సిన్లకు అనుమతికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

ఇప్పటివరకూ రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు మొత్తం 13.10 కోట్ల వ్యాక్సిన్‌ డోస్‌లు సరఫరా చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. వీటిలో వృథాతో కలుపుకొని 11.43 కోట్ల డోస్‌లు వినియోగించారని.. ఇంకా 1.67 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు ఉన్నాయని వెల్లడించింది.

రోజుకు 41 లక్షలకు పైగా వ్యాక్సిన్‌ డోస్‌లను అందిస్తున్నారని.. ప్రపంచ దేశాలతో పోలిస్తే ఎక్కువ మందికి వ్యాక్సిన్‌ ఇస్తున్న దేశం మనదేనని ఆరోగ్యశాఖ పేర్కొంది. కరోనాతో బాధపడుతూ ఆక్సిజన్‌ అవసరమైన రోగులకు మాత్రమే రెమ్‌డెసివిర్‌ ఇవ్వాలని... ఎలాంటి లక్షణాలు లేకుండా హోం క్వారంటైన్‌లో ఉన్న వారు దీన్ని వినియోగించవద్దని స్పష్టం చేసింది.

ప్రస్తుతానికి దేశంలో రెమ్‌డెసివర్‌ కొరత ఎక్కడా లేదని.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి మాత్రమే ఈ మందు ఇవ్వాలని కేంద్రం వైద్యులు, ఆసుపత్రులకు విజ్ఞప్తి చేసింది. 45 సంవత్సరాలు పైబడిన వారందరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలని, దీని వల్ల వ్యాధి నియంత్రణ సాధ్యమవుతుందని ఐసీఎంఆర్‌ డీజీ బలరామ్‌ భార్గవ తెలిపారు.

రెండు డోస్‌లు తీసుకున్న తర్వాత శరీరంలో యాంటీబాడీస్‌ వృద్ధి చెంది కరోనాను సమర్థంగా ఎదుర్కొనే శక్తి లభిస్తుందని తెలిపారు. ఒక వేళ కరోనా బారిన పడ్డా, మరణాల రేటు తక్కువగా ఉంటుందని భార్గవ వివరించారు. వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో 85 శాతం వరకూ ఆస్పత్రి పాలయ్యే పరిస్థితి ఉండదని ఆయన స్పష్టం చేశారు. 

click me!