భారత్ ను ఒక పెద్దజైలుగా మార్చేసింది: కాంగ్రెస్ పై మోదీ ఫైర్

By Nagaraju penumalaFirst Published Jun 25, 2019, 6:08 PM IST
Highlights

దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో దేశంలో ఏర్పడిన సంక్షోభాన్ని గుర్తు చేశారు. ఆనాడు ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యానికి పాతరేశారంటూ మండిపడ్డారు. ఎమర్జెన్సీ ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసిందని ఆరోపించారు. భారత్ ను ఒక పెద్దజైలుగా మార్చేసిందంటూ మోదీ ధ్వజమెత్తారు. 
 

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు భారత ప్రధాని నరేంద్రమోదీ. కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని ఒక పెద్దజైలుగా మార్చేసిందని ఆరోపించారు. వాస్తవాలు తెలియకుండా ఇతర పార్టీలపై బురదజల్లడం కాంగ్రెస్ పార్టీ అలవాటుగా మార్చుకుందన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై ప్రసంగించిన మోదీ కాంగ్రెస్ పార్టీ నేల విడిచి సాము చేసిందని విమర్శించారు.

ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు ఉపయోగకరమైన సూచనలు సలహాలు ఇస్తూ నిర్మాణాత్మక పాత్ర పోషించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలు చేసిన అభివృద్ధిని గుర్తించలేదని ఆరోపించారు. 

రాష్ట్రపతి ప్రసంగం ప్రజల మనోభవాలకు అద్దంపట్టిందని మోదీ అభిప్రాయపడ్డారు. తాము ఐదేళ్లపాటు చేసిన అభివృద్ధికి నిదర్శనమే ఈ ఎన్నికల ఫలితాలు అంటూ చెప్పుకొచ్చారు.తమపై భరోసా ఉంచిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ప్రధాని మోదీ. 

కాంగ్రెస్ పార్టీ దేశానికి ఎంతో సేవ చేసిన వారిని కూడా పట్టించుకోలేదని విమర్శించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి, పీవీ నరసింహారావులను కనీసం గౌరవించలేదన్నారు. తమ ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న ఇచ్చి గౌరవించిందని చెప్పుకొచ్చారు.

కానీ కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గానీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లకు ఎందుకు భారత రత్న ఇవ్వలేకపోయిందో చెప్పాలని నిలదీశారు. మాజీప్రధాని మన్మోహన్ సింగ్ సేవలను ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గుర్తంచలేకపోతున్నారంటూ ధ్వజమెత్తారు ప్రధాని నరేంద్రమోదీ. 

ఈ సందర్భంగా దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో దేశంలో ఏర్పడిన సంక్షోభాన్ని గుర్తు చేశారు. ఆనాడు ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యానికి పాతరేశారంటూ మండిపడ్డారు. ఎమర్జెన్సీ ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసిందని ఆరోపించారు. భారత్ ను ఒక పెద్దజైలుగా మార్చేసిందంటూ మోదీ ధ్వజమెత్తారు. 

click me!