భారత్ జోడో యాత్రను అస్థిరపరిచేందుకు ప్రధాని మోడీ ఓవర్ టైం పని..: కాంగ్రెస్ నేత జైరాం రమేష్

By Mahesh RajamoniFirst Published Aug 31, 2022, 2:55 AM IST
Highlights

కాంగ్రెస్: సెప్టెంబరు 7న రాహుల్ గాంధీ నేతృత్వంలో 3,570 కిలోమీటర్ల మేర దేశవ్యాప్త పాదయాత్ర ప్రారంభించనున్న కాంగ్రెస్ పార్టీ..  'భారత్ జోడో యాత్ర' లోగో, ట్యాగ్‌లైన్, దానికి సంబంధించిన పోస్ట‌ర్ల‌ను ఇప్ప‌టికే విడుద‌ల చేసింది. క‌న్యాకుమారి నుంచి క‌శ్మీర్ వ‌ర‌కు ఈ యాత్ర కొన‌సాగ‌నుంది.
 

భారత్ జోడో యాత్ర:  కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగే భారత్ జోడో యాత్రను అస్థిరపరిచేందుకు భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ), ప్రధాని నరేంద్ర మోడీ ఓవర్‌టైమ్‌ పనిచేస్త‌న్నార‌ని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. సెప్టెంబరు 7న రాహుల్ గాంధీ నేతృత్వంలో తమిళనాడులోని కన్యాకుమారి నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు 3,750 కిలోమీటర్ల మేర 150 రోజుల పాటు యాత్ర సాగనుంది. రానున్న లోస్ స‌భ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి అధికార పీఠం ద‌క్కించుకోవడానికి ఇప్ప‌టినుంచే ప్ర‌ణాళికలు ర‌చిస్తూ.. ప్ర‌స్తుత కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు ప్ర‌జావ్య‌తిరేక నిర్ణ‌యాలను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్తూ, అప్ర‌మ‌త్తం చేయ‌డంలో భాగంగా యాత్ర జ‌రుగుతున్న‌ది. 

ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు, ప్ర‌ధాని మోడీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. భార‌త్ జోడో యాత్ర‌ను ఆప‌డానికి బీజేపీ స‌ర్కారు ప్ర‌య‌త్నిస్తున్న‌ద‌ని ఆరోపించారు. "నాకు తెలిసిన అనేక రాజకీయ పార్టీలలో మోడీకి చాలా మంది స్నేహితులు ఉన్నారు. భార‌త్ జోడో యాత్రను అస్థిరపరిచేందుకు ఆయన ఓవర్ టైం పనిచేస్తున్నారు. ధరల పెరుగుదలపై ఆగస్టు 5న మా నిరసన భారీ విజయవంతమైంది కాబట్టి ఈ యాత్ర విజయవంతం కాకూడదని బీజేపీ ఓవర్ టైం పని చేస్తోంది" అని జైరామ్ రమేష్ అన్నారు. 

యాత్రకు వారం రోజుల ముందు గులాం నబీ ఆజాద్ పార్టీకి రాజీనామా చేయడంతో పాటు కాంగ్రెస్‌లో ఇటీవలి పరిణామాలను ప్రస్తావిస్తూ.. "ప్రజలు రావచ్చు, ప్రజలు వెళ్ళవచ్చు, ప్రజలు ప్రకటనలు ఇవ్వవచ్చు, ప్రజలు మనపై దాడి చేయవచ్చు, ప్రజలు గాంధీపై దాడి చేయవచ్చు... అయితే, దాంతో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. భార‌త్ జోడో యాత్ర మాత్రం కొనసాగుతుంది. ఇప్పటికే పార్టీని వీడి వెళ్లిన వారు, డిపార్చర్ లాంజ్‌లో వేచి ఉన్నవారు మోడీకి, ఆర్‌ఎస్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు" అంటూ పేర్కొన్నారు. 'భారత్ జోడో యాత్రను అస్థిరపరిచేందుకు ఈ మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతోంది' అని జైరాం రమేష్ అన్నారు.

కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి తారిఖ్ అన్వర్, ఎంపీ శశి థరూర్, కేపీసీసీ చీఫ్ కే సుధాకరన్, సీనియర్ నేత రమేష్ చెన్నితాల కూడా ఈ మీడియా స‌మావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ పతనం, పతనాన్ని అంచనా వేసే వారందరికీ నిరాశే మిగులుతుందని రమేష్ అన్నారు. భారత్ జోడో యాత్ర కాంగ్రెస్‌కు సంజీవని అని పేర్కొన్నారు. ఈ యాత్రను ప్రధాని మోడీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు పార్టీ చేపట్టిన "ఆచరణాత్మకమైన, నిర్దిష్టమైన- ప్ర‌భావ‌వంత‌మైన చొరవ"గా అభివర్ణించారు. అయితే, కాంగ్రెస్ ను వీడిన కొంద‌రు నాయకులు బీజేపీ ప్రభుత్వంతో మ్యాచ్ ఫిక్సింగ్ ఏర్పాట్లు చేసుకున్నారని ఆరోపించారు. ప్ర‌ధాని మోడీ ప్రభుత్వ ఆర్థిక, సామాజిక, రాజకీయ విధానాలకు భారత్ జోడో యాత్ర వ్యతిరేకమని అన్నారు. "ఇది కార్యకర్తలను ఉత్సాహపరుస్తుందని మేము ఆశిస్తున్నాము. ఇది పార్టీని క్రియాశీలం చేస్తుంది" అని అన్నారు.

కాగా, సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర 19 రోజుల్లో ఏడు జిల్లాల మీదుగా 450 కిలోమీటర్ల మేర కేరళ మీదుగా సాగుతుందని కాంగ్రెస్ పేర్కొంది. 12 రాష్ట్రాలు, దేశ రాజధానిని తాకనున్న ఈ యాత్ర లక్ష్యం కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని, దేశానికి ఆర్‌ఎస్‌ఎస్ ఎజెండాను తీవ్రంగా వ్యతిరేకించడమేనని పేర్కొంది.

click me!