థర్డ్ వేవ్‌కు అవకాశమివ్వొద్దు.. అలసత్వం వద్దు: కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్

Published : Aug 09, 2021, 05:41 PM IST
థర్డ్ వేవ్‌కు అవకాశమివ్వొద్దు.. అలసత్వం వద్దు: కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్

సారాంశం

బహిరంగ ప్రదేశాల్లో కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించి థర్డ్ వేవ్‌ను అడ్డుకోవాలని, ఇందులో నిర్లక్ష్యం వలదని కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. బెంగళూరు వాసులు తొలి వేవ్‌‌ను సమర్థంగా ఎదుర్కొన్నారని, మళ్లీ అదే రీతిలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. 'బెంగళూరు ఫైట్స్ కరోనా' పేరిట నిర్వహిస్తున్న సమావేశాల్లో ఆయన నగరవాసులను ఉద్దేశించి మాట్లాడారు.

బెంగళూరు: కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో అలసత్వం వహించవద్దని, కొవిడ్ నిబంధనలు అందరూ తప్పనిసరిగా పాటించాలని కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యూర్షిప్ శాఖ, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సూచించారు. ఎట్టిపరిస్థితుల్లో కరోనా థర్డ్ వేవ్‌కు అవకాశమివ్వవద్దని అన్నారు. ఫస్ట్ వేవ్‌ను బెంగళూరు వాసులు సమర్థంగా ఎదుర్కొన్నారని, అన్ని నిబంధనలు పాటించి తొలి వేవ్ నుంచి బయటపడ్డారని గుర్తుచేశారు. 'బెంగళూరు ఫైట్స్ కరోనా' పేరుతో నిర్వహిస్తున్న వెబినార్ సిరీస్ నాలుగో ఎపిసోడ్‌లో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ప్రజలనుద్దేశించి మాట్లాడారు.

కరోనా మహమ్మారిపై పోరు కీలక దశకు చేరుకున్న తరుణంలో తొలి వేవ్‌ విజృంభించిన కాలాన్ని మరోసారి గుర్తుచేసుకోవడం సముచితమని కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సూచించారు. గత 18 నుంచి 19 నెలల్లో మహమ్మారి విలయాన్ని గుర్తుంచుకుని, మళ్లీ అలాంటి పరిస్థితులు అవకాశమివ్వకుండా మసులుకోవాల్సిన అవసరముందని తెలిపారు. అందరూ కలిసికట్టుగా పోరాడాలని, ప్రభుత్వం,  ప్రజలూ ఈ పోరులో ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. 

గతకొన్నాళ్లుగా బెంగళూరులో మళ్లీ కేసులు పెరుగుతున్నాయని, ఇది ఎంతమాత్రం శ్రేయస్కరం కాదని తెలిపారు. అందుకే గతేడాది ఏప్రిల్, మే నెలల్లో పాటించిన జాగ్రత్తలను మళ్లీ గుర్తుచేసుకోవాలని, అప్రమత్తంగా వ్యవహరించి థర్డ్ వేవ్‌ రాకుండా అడ్డుకట్ట వేయాలన్నారు. మాస్కులు ధరించడం, బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించడం, టీకా వేసుకోవడం అత్యావశ్యకమని, మరికొన్ని నెలలు ఈ నిబంధనలు తప్పక పాటించాలని చెప్పారు. ఐసీఎంఆర్ ప్రతినిధులు, లేదా ప్రధాన మంత్రి చెప్పే వరకు వీటిపై నిర్లక్ష్యం వద్దని తెలిపారు.

గతేడాది కంటే నేడు పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని, వైద్యసదుపాయాలతోపాటు టీకాలు అందుబాటులోకి వచ్చాయని కేంద్ర మంత్రి వివరించారు. సింగిల్ డోసు వ్యాక్సిన్ జాన్సెన్‌కు అత్యవసర వినియోగ అనుమతి లభించిందని గుర్తుచేశారు. ఇప్పటికే 50 కోట్ల మంది టీకా వేసుకున్నారని, ఈ ఏడాది చివరినాటికి వందకోట్ల మందికిపైగా టీకా పంపిణీ చేస్తామని అంచనా వేశారు. ఈ సమావేశంలో బెంగళూరులోని హెచ్‌సీజీ హాస్పిటల్ డీన్ డాక్టర్ విశాల్ రావు, ఫోర్టిస్ హాస్పిటల్ డైరెక్టర్(పల్మనాలజీ) డాక్టర్ వివేక్ పడేగాల్‌తోపాటు పలువురు వైద్యనిపుణులు మాట్లాడారు.

PREV
click me!

Recommended Stories

Indian Army Romeo Force Destroys: గడ్డ కట్టే మంచులో మన ఇండియన్ ఆర్మీ| Asianet News Telugu
Tourists Enjoy New Year’s First Snow in Chamba: మంచు కొండల్లో న్యూఇయర్ వేడుకలు | Asianet News Telugu