
రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. పార్లమెంట్ భవనంలో ఉదయం 11 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా ఉన్న రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు చేపట్టారు. మొదటగా ఎంపీల ఓట్ల లెక్కింపు, అనంతరం ఎమ్మెల్యేల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఆంగ్ల అక్షరమాల ప్రకారం రాష్ట్రాల వారీగా ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ సాయంత్రానికి తుది ఫలితం వెల్లడి కానుందని సమాచారం. ఇక, జూలై 24తో ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం ముగియనున్న సంగతి తెలిసింది. ఈ ఎన్నికలో విజయం సాధించిన వారు.. జూలై 25న భారత నూతన రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలో నిలిచారు. ఇక, రాష్ట్రపతి ఎన్నికల్లో 99.12 ఓటింగ్ శాతం నమోదైంది. రాష్ట్రపతి ఎన్నికలో 4,754 ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే పలు ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ద్రౌపది ముర్ముకు మద్దతుగా ఓటు వేశారనే ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే భారీ మెజారిటీతో ద్రౌపది ముర్ము విజయం సాధిస్తుందని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంది.
ఇక, రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు ఎన్నుకుంటారనే సంగతి తెలిసిందే. ఇందులో పార్లమెంటు ఉభయ సభలు, అన్ని రాష్ట్రాల శాసనసభల సభ్యులు.. అలాగే ఢిల్లీ, పుదుచ్చేరి అసెంబ్లీలకు ఎన్నికైన సభ్యులు ఉంటారు.రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేల ఓటు విలువ వేర్వేరుగా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంపీలకు ఆకుపచ్చ, ఎమ్మెల్యేలకు పింక్ బ్యాలెట్ పేపర్లను ఈసీ కేటాయించింది. రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో జరుగుతుంది. ఫలానా అభ్యర్థికి ఓటు వేయాలంటూ పార్టీలు తమ ఎంపీలు, ఎమ్మెల్యేలకు విప్ జారీ చేయలేవు. కాబట్టి ఓటింగ్కు అవకాశం ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ లేనందున ఒక్కో ఎంపీ ఓటు విలువ 708 నుంచి 700 తగ్గింది. ఇక ఎమ్మెల్యేలు ఓటు విలువలో 208 తో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. 176 తో jharkhand, తమిళనాడు రెండో స్థానంలో, 175 తో మహారాష్ట్ర మూడో స్థానంలో ఉన్నాయి.