
న్యూఢిల్లీ: పంజాబ్(Punjab)లో భద్రతా లోపం(Security Lapse) వల్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi) బుధవారం 20 నిమిషాల పాటు ఓ ఫ్లై ఓవర్‌పై నిలిచిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత తన పర్యటనను రద్దు చేసుకుని అక్కడి నుంచి వెనక్కి రావల్సి వచ్చింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనను సుప్రీంకోర్టు విచారిస్తున్నది. ఈ సందర్భంగానే తాజాగా, పంజాబ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. పంజాబ్ ప్రభుత్వం ఈ ఘటనపై దర్యాప్తు చేయడానికి కమిటీ వేయవద్దని కేంద్రం వాదించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్రావెల్ రికార్డులు భద్రపరచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పంజాబ్, హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశిస్తూ.. ఆ రికార్డులు అన్ని తమ కస్టడీలో ఉంచుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, ఆ రిజిస్ట్రార్ జనరల్‌కు పంజాబ్ పోలీసులు, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ), ఇతర కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీలూ సహకరించాలని తెలిపింది. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు సహకరించాలని, అవసరమైన సహాయాన్ని అందించాలని కోరింది.
పంజాబ్ పర్యటనలో ప్రధాని మోడీపై యాక్షన్ తీసుకోవాలని నిషేధిత ఉగ్రవాద సంస్థ సిఖ్ ఫర్ జస్టిస్ బహిరంగ పిలుపు ఇచ్చిందని, ఇది అంతర్జాతీయ ఉగ్రవాద కుట్రలో భాగంగా జరిగి ఉండవచ్చనీ సొలిసిటర్ జనరల్ వాదించారు. అందుకే.. ఆ రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసి ప్రధాని మోడీకి భద్రతా వైఫల్యం ఘటనపై దర్యాప్తు చేయరాదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు కోసం ప్రత్యేకంగా కమిటీ వేయరాదని కోరారు. ఇది కేవలం న్యాయాన్ని తప్పు పట్టే ప్రయత్నంగానూ ఉండవచ్చని అన్నారు. ప్రధాని మోడీ భద్రతా లోపం ఘటనపై దర్యాప్తులో కచ్చితంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఉండాలని వాదించారు.
ప్రధాన మంత్రికి భద్రతా వైఫల్యం కలగడం అరుదుల్లోకెల్ల అరుదు అని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇది అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను దెబ్బతీసే విషయంగా ఉన్నదని పేర్కొంది. అంతేకాదు, ఈ ఘటనను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సమర్థించింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టులో వాదించారు. ప్రధాన మంత్రి భద్రతకు సంబంధించి తీవ్ర పరిస్థితులను ఈ ఘటన ప్రేరేపించిందని ఆయన కోర్టులో అన్నారు. పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన, ఆయనకు కల్పించిన భద్రతకు సంబంధించిన ప్రతి రికార్డులను సేకరించడానికి ఆదేశాలు జారీ చేయాలని బుధవారం కోరారు.
ప్రధాని మోడీకి భద్రతా లోపం కేవలం పంజాబ్ పోలీసులు, పంజాబ్ ప్రభుత్వమే కారణంగానే ఏర్పడిందని ఆయన కోర్టులో వాదించారు. అంతేకాదు, సరిహద్దు వెలుపల నుంచి పొంచి ఉన్న ఉగ్రవాదమూ కారణమై ఉండొచ్చని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలను కచ్చితంగా నివారించాల్సిందని తెలిపారు. ఇది అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను మసకబార్చే ఘటన అని చెప్పారు.
పంజాబ్ సీఎం ఓ చానెల్‌తో మాట్లాడుతూ, ప్రధాని మోడీ భటిండా నుంచి ఫెరోజ్‌పుర్‌కు హెలికాప్టర్‌లో వెళ్లాల్సిందని, కానీ, వర్షం కారణంగా ఆయన ప్లాన్ మారిందని అన్నారు. హఠాత్తుగా ఆయన భటిండా నుంచి ఫెరోజ్‌పుర్‌కు కారు కాన్వాయ్‌లో బయల్దేరారని వివరించారు. దీనికి సంబంధించి తమకు ముందస్తు సమాచారం లేదని తెలిపారు. అన్ని దారుల్లోనూ రైతులు ధర్నాలు చేయకుండా కన్విన్స్ చేయడానికి తాను ఉదయం 3 గంటల వరకు పని చేశానని చెప్పారు. బుధవారం ఉదయానికల్లా అన్ని మార్గాలనూ ఓపెన్ చేయగలిగామని పేర్కొన్నారు. రోడ్డు మార్గంలో ప్రధాని ప్రయాణించే ప్లానే లేదని, ఒక వేళ ఉన్నా తమకు ముందస్తుగా ఆ వివరాలు తెలిపితే.. తగిన ఏర్పాట్లు చేసేవాళ్లమని తెలిపారు. రైతులు ఏడాది కాలంగా శాంతియుతంగా నిరసనలు చేస్తున్నారని, వారిపై లాఠీ చార్జ్ చేసే ప్రసక్తే లేదని అన్నారు. ప్రధాని పర్యటనలో భద్రతా లోపం లేదని, ఆయనపై దాడి ప్రయత్నాలు అసలే లేవని పేర్కొన్నారు. ప్రధాని వెళ్తున్న దారిలో రైతులు ఓ చోట ఎడ్ల బండిని నిలిపారని, ఇది చాలా సహజమని, ఇది సెక్యూరిటీ బ్రీచ్ కాదని వివరించారు. అంతేకాదు, బీజేపీ తలపెట్టిన ర్యాలీలో 70 వేల మందికి ఏర్పాట్లు జరిగాయని, కానీ, అక్కడకు కేవలం 700 మంది మాత్రమే వచ్చారని తెలిపారు. ప్రధాని మోడీ మార్గం మధ్య నుంచే వెనుదిరిగి పోవడానికి ఇదీ ఓ కారణం అయి ఉండొచ్చని అన్నారు.