2025 మహా కుంభమేళా కోసం ప్రయాగరాజ్ రైల్వే డివిజన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 10 కోట్ల మంది భక్తులు రైళ్లలో ప్రయాణిస్తారని అంచనా... ఇందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రయాగ్ రాజ్ : మహా కుంభమేళా కోసం ప్రయాగరాజ్ రైల్వే డివిజన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మకర సంక్రాంతి, మౌని అమావాస్య, వసంత పంచమి, మాఘీ పౌర్ణమి వంటి ముఖ్యమైన రోజుల్లో పుణ్యస్నానం కోసం భారీగా తరలివస్తారు. కాబట్టి ఆరోజుల్లో ప్రయాణికులను కంట్రోల్ చేసేలా ప్రయాగరాజ్ రైల్వే డివిజన్‌లోని అన్ని స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. స్టేషన్లలో తొక్కిసలాటను నివారించడానికి ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేశారు. మహా కుంభమేళాకు వచ్చే 45 కోట్ల మంది భక్తుల్లో 10 కోట్ల మంది రైళ్లలో ప్రయాణిస్తారని అంచనా. ఈ మేరకు 3000 ప్రత్యేక రైళ్లతో సహా మొత్తం 13000 రైళ్లు నడపాలని ప్రయాగరాజ్ రైల్వే డివిజన్ ప్రణాళిక రూపొందించింది.
ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో ప్రత్యేకమైన రోజుల్లో ప్రయాగరాజ్ స్టేషన్ లోకి ప్లాట్‌ఫామ్ నెం.1 వైపు నుంచే ఎంట్రీ ఉంటుంది.ఇక ఎగ్జిట్ మాత్రం సివిల్ లైన్స్ వైపు నుంచి ఉంటుంది. రిజర్వేషన్ లేని ప్రయాణికులను వారి గమ్యస్థానాల ఆధారంగా వేర్వేరు రెస్ట్ ఏరియాల్లోకి తరలిస్తారు. రిజర్వేషన్ ఉన్న ప్రయాణికులకు ప్రయాగరాజ్ జంక్షన్ సిటీ సైడ్ నుంచి గేట్ నెం.5 ద్వారా ప్రవేశం కల్పిస్తారు. నైనీ జంక్షన్‌లో ప్రవేశం స్టేషన్ రోడ్ నుంచి, ఎగ్జిట్ మాల్‌గోడౌన్ వైపు నుంచి ఉంటుంది. ప్రయాగరాజ్ చివ్కి స్టేషన్‌లో ప్రవేశం ప్రయాగరాజ్-మిర్జాపూర్ హైవేను కలిపే సివోడి రోడ్డు నుంచి, ఎగ్జిట్ జిఈసి నైనీ రోడ్డు వైపు నుంచి ఉంటుంది.
మహా కుంభమేళా వేళ ప్రత్యేక రోజుల్లో సుబేదార్‌గంజ్ స్టేషన్‌లో ప్రవేశం జల్వా, కౌశాంబి రోడ్డు వైపు నుంచి... ఎగ్జిట్ని జిటి రోడ్డు వైపు నుంచి ఉంటుంది. ప్రయాగ జంక్షన్‌లో ప్రవేశం చాతం లైన్, ప్లాట్‌ఫామ్ నెం.1 వైపు నుంచి... ఎగ్జిట్ రాంప్రియా రోడ్, ప్లాట్‌ఫామ్ నెం.4 వైపు నుంచి ఉంటుంది. రిజర్వేషన్ ఉన్న ప్రయాణికులకు సహసోన్ మార్గం ద్వారా ప్రవేశం కల్పిస్తారు.
ఫాఫామౌ స్టేషన్‌లో ప్రవేశం రెండవ ప్రవేశ ద్వారం, ప్లాట్‌ఫామ్ నెం.4 వైపు నుంచి...ఎగ్జిట్ ఫాఫామౌ బజార్ వైపు నుంచి ఉంటుంది. ప్రయాగరాజ్ రాంబాగ్ స్టేషన్‌లో ప్రవేశం హనుమాన్ మందిర్ చౌరస్తా వైపు నుంచి, ఎగ్జిట్ లౌడర్ రోడ్డు వైపు నుంచి ఉంటుంది. ప్రయాగ సంగమ్ స్టేషన్, దారాగంజ్ స్టేషన్లు మేళా ప్రాంతంలో ఉండటం వల్ల ప్రత్యేక రోజుల్లో మూసివేస్తారు.