మహా కుంభం 2025 భద్రతా ఏర్పాట్లు ... యోగి ప్లాన్ అదిరిందిగా..

By Arun Kumar P  |  First Published Jan 1, 2025, 11:28 PM IST

ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన కార్యక్రమం ప్రయాగరాజ్ మహా కుంభమేళా 2025 లో భద్రతా ఏర్పాట్లను పూర్తిచేసింది యోగి సర్కార్. మేళా ప్రాంతంలో కట్టుదిట్టమైన నిఘా, సెర్చ్ ఆపరేషన్లు, సైబర్ మోసాలపై ప్రత్యేక దృష్టి ఉంటుంది.


మహా కుంభమేళా : ప్రయాగరాజ్‌లో మహా కుంభమేళా 2025ను విజయవంతంగా నిర్వహించడానికి యోగి సర్కార్ కృతనిశ్చయంతో ఉంది. ఈ క్రమంలోనే మేళా ప్రాంతంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం ప్రయాగరాజ్ పర్యటనలో మహా కుంభ ఏర్పాట్లను సమీక్షించారు... ఈ సందర్భంగా భద్రత, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యతనిస్తూ అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సీఎం యోగి ఆదేశాల మేరకు పోలీసు యంత్రాంగం సన్నద్ధమైంది.

అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా

మహా కుంభమేళాఏర్పాట్ల పురోగతిని సమీక్షించడానికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం ప్రయాగరాజ్‌లో పర్యటించారు. భద్రత విషయంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రయాగరాజ్, పరిసర జిల్లాల్లో విస్తృతంగా సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించడం, హోటళ్ళు, రెస్టారెంట్లు, వీధి వ్యాపారులు, అక్రమ కాలనీలలో తనిఖీలు చేపట్టడంతో పాటు మేళా ప్రాంతం, ప్రయాగరాజ్‌కు వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. లైసెన్స్, పర్మిట్ లేని వాహనాల ప్రవేశాన్ని నిషేధించడం... అనుమానితులను, వస్తువులను తనిఖీ చేయడం, విచారించడంతో పాటు ఎల్ఐయు, ఐబిని అప్రమత్తంగా ఉంచాలని ఆదేశించారు. ప్రయాగరాజ్ పోలీసులు దీనిపై చర్యలు తీసుకుంటున్నారు.

మహా కుంభామేళాకు ముందే పోలీసు అధికారులు, సిబ్బందిని మోహరించాలని ఆదేశించారు. విధుల్లో ఉన్న పోలీసులకు బస, భోజన వసతులు కల్పించాలని సూచించారు. మేళాలో వీలైనంత వరకు రిజర్వ్ పోలీసు బలగాలను వినియోగించాలని, ఇతర జిల్లాల పోలీసులను అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే పిలవాలని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రయాగరాజ్ తో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల భద్రతను పటిష్టం చేయాలని సూచించారు. 

Latest Videos

మహా కుంభంలో ఎలాంటి అక్రమ వసూళ్లు, కాంట్రాక్టులు లేదా మోసాలను లేకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సైబర్, ఆన్‌లైన్ మోసాలను పర్యవేక్షించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడంతో పాటు అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వేగంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

జీరో ఎర్రర్ పాలసీతో భద్రతా ఏర్పాట్లు

ముఖ్యమైన స్నాన పర్వదినాల్లో భారీగా తరలివచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని తొక్కిసలాట, ట్రాఫిక్ జామ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఎం యోగి ఆదేశించారు. నగరం, మేళా ప్రాంతంలోకి ప్రవేశించే మార్గాల్లో క్రేన్‌లను ఏర్పాటు చేయాలని ట్రాఫిక్ పోలీసులకు సూచించారు. రూట్ మ్యాప్, భక్తుల రాకపోకల మార్గాలను సక్రమంగా నిర్వహించాలని సూచించారు.

మహా కుంభమేళాలో భద్రతా ఏర్పాట్లు జీరో ఎర్రర్ పాలసీ ప్రకారం ఉండాలని సీఎం యోగి ఆదేశించారు. సంగమంలో స్నానం చేసేటప్పుడు జల పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పడవల నిర్వహణ, భద్రతా ప్రమాణాలను పాటించడంతో పాటు, అధిక రద్దీ వేళ గందరగోళం ఏర్పడితే పాంటూన్ వంతెనలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.

click me!