
గత కొంత కాలంగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లో చేరబోతున్నారంటూ ఊహాగానాలు వస్తున్నాయి. ఈ ఊహాగానాల మధ్య నేడు ఆయన సోనియా గాంధీ కుటుంభ సభ్యులను కలిశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తో పాటు ముఖ్యమైన నాయకులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో కాంగ్రెస్ లో చేరే అంశంపై తీవ్రంగా చర్చ జరిగినట్టు సమాచారం.
2024 సార్వత్రిక ఎన్నికలతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల్లో కాంగ్రెస్ ను విజయతీరాలకు చేర్చేందుకు, ఆ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు గాంధీ కుటుంబంతో పీకే ఇటీవల చర్చలను పునఃప్రారంభించారు. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ వర్గాలు స్పందించాయి. కేవలం గుజరాత్ ఎన్నికల కోసం మాత్రమే చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నాయి. అయితే దీనికి పీకే సన్నిహిత వర్గాలు ఎదురుదాడి చేశాయి. కాంగ్రెస్ నాయకత్వానికి, ప్రశాంత్ కిశోర్ కు మధ్య ప్రధానంగా 2024 జాతీయ ఎన్నికల కోసం బ్లూప్రింట్ పై వారు చర్చిస్తున్నట్టు చెప్పారు.
2024 కోసం ఇరుపక్షాలు ఒక ఒప్పందానికి వచ్చిన తర్వాత గుజరాత్ లేదా మరే ఇతర రాష్ట్రంలోనైనా ఎన్నికల బాధ్యతలను పీకేకు అప్పగిస్తారని వర్గాలు పేర్కొన్నాయి. అయితే గుజరాత్ ఎన్నికల బాధ్యతల ఆఫర్ మాత్రమే పీకేకు అప్పగించారని కాంగ్రెస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.
కాంగ్రెస్ పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని ప్రశాంత్ కిషోర్ భావిస్తున్నారు. అయితే ఈ విషయంలో తనకు పూర్తి స్థాయి బాధ్యతలను అప్పగించాలని సోనియా గాంధీ కుటుంబాన్ని గత కొంత కాలంగా కోరుతున్నారు. అయితే దీని కోసం పీకే సలహాదారుడిగా కాకుండా కాంగ్రెస్ లో చేరాల్సి ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై ఆయన ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఆయన తన భవిష్యత్తు ప్రణాళికను మే 2 వరకు ప్రకటిస్తానని పేర్కొన్నారు. ఆ సమయం వరకు ఆయన ఏదో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.
గతేడాది కూడా సోనియా గాంధీ కుటుంబంకు ప్రశాంత్ కిషోర్ కు మధ్య చర్చలు జరిగాయి. అయితే పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ విజయం సాధించడంతో ఈ చర్చలు కుప్పకూలాయి. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ విజయం సాధించడంలో ప్రశాంత్ కిషోర్ అతి ముఖ్యమైన పాత్ర పోషించారు. దీంతో కాంగ్రెస్ తన ఎన్నికల ప్రచారాలను నిర్వహించడానికి ప్రశాంత్ కిషోర్ మాజీ సహచరుడితో ఒప్పందం కుదుర్చుకుంది.
అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఈ నేపథ్యంలో రెండు వర్గాల మధ్య మరో సారి చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే చర్చల్లో రెండు వర్గాలు గతంలో మాదిరిగానే తమ వైఖరిని మార్చుకోకపోతే ఇవి విఫలమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.