బాత్ బీహార్ కీ: నితీష్ కుమార్ పై యుద్ధం ప్రకటించిన ప్రశాంత్ కిశోర్

By telugu teamFirst Published Feb 18, 2020, 11:31 AM IST
Highlights

నితీష్ కుమార్ తనను కొడుకులా చూసుకున్నాడని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నాడు. నితీష్ కుమార్ తనకు మంచి సంబంధాలున్నాయని ఆయన అన్నారు. ఈ నెల 20 నుంచి బాత్ బీహార్ కీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రశాంత్ కిశోర్ చెప్పారు.

న్యూఢిల్లీ: బీహార్ ముఖ్యమంత్రి, జేడీయు అధినేత నితీష్ కుమార్ తనను కొడుకులా చూసుకున్నాడని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చెప్పారు. ప్రశాంత్ కిశోర్ ను నితీష్ కుమార్ ఇటీవల పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. నితీష్ కుమార్ తో తనకు మంచి సంబందాలున్నాయని ఆయన చెప్పారు. 18వ తేదీన తాను బిగ్ అనౌన్స్ మెంట్ చేస్తానని చెప్పిన నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ ప్రెస్ మీట్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. 

నితీష్ కుమార్ తన సిద్ధాంతంపై రాజీ పడడాన్ని ప్రశాంత్ కిశోర్ ప్రశ్నించారు. బిజెపితో పొత్తు పెట్టుకోవడానికి నితీష్ కుమార్ ఆ పనిచేశారని ఆయన విమర్శించారు. ఎన్డీఎ సంకీర్ణంలో నితీష్ కుమార్ ఉండాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. 

పార్టీ సిద్ధాంతం గురించి తనకూ నితీష్ జీకి మధ్య చాలా చర్చ జరిగిందని, పార్టీ గాంధీజీ సిద్ధాంతాన్ని ఎప్పుడూ వదిలేయదని నితీష్ చెప్పారని ఆయన గుర్తు చేశారు. గాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సే పట్ల మెతక వైఖరి ఉన్నవారితో పార్టీ ప్రస్తుతం కలిసి పనిచేస్తోందని, తనకు సంబంధించినంత వరకు గాంధీజీ, గాడ్సే కలిపి పనిచేయడం సాధ్యం కాదని ఆయన అన్నారు.

నితీష్ కూమార్ తనను కుమారుడిలా చూశారని, తాను నితీష్ ను తండ్రిలా చూశానని, పార్టీలోకి తనను తీసుకోవడమూ పార్టీ నుంచి తనను బహిష్కరించడం నితీష్ కుమార్ కు సంబంధించిందని, నితీష్ కుమార్ పై తనకు గౌరవం ఉందని ప్రశాంత్ కిశోర్ చెప్పారు. బిజెపితో చేతులు కలిపిన తర్వాత నితీష్ కుమార్ మారిపోయారని ఆయన వ్యాఖ్యానించారు.

కేవలం ఎన్నికల్లో గెలవడానికే బిజెపితో నితీష్ చేతులు కలిపారని ఆయన విమర్శించారు. బీహార్ లో అభివృద్ది లేదని, బిజెపితో పొత్తు వల్లనే బీహార్ లో అభివృద్ధి లేదని, 2005నాటి పరిస్థితే ఉందని ఆయన అన్నారు. నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం అత్యంత వెనకపబడిన రాష్ట్రం బీహార్ ్న్ి ఆయన అన్నారు.

ఈ ఏడాది చివరలో బీహార్ లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బాత్ బీహార్ కీ అనే కార్యక్రమం గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 20వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా వేలాది మంది యువ ఓటర్లను చేరుతామని ప్రశాంత్ కిశోర్ చెప్పారు. నితీష్ కుమార్ ప్రభుత్వంపై ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేయడమే కాదు, బీహార్ అభివృద్ధికి కూడా పాటు పడుతామని ఆయన చెప్పారు.

నితీష్ కుమార్ తో సంబంధాలు దెబ్బ తినడంపై ఆయన స్పందిస్తూ... బిజెపిపై నితీష్ కుమార్ ఎక్కువడా ఆధారపడ్డారని, కాషాయం పార్టీతో సంబంధాలు రాష్ట్రానికి మంచివి కావని ఆయన అన్నారు. నితీష్ కుమార్ తో విరివిగా చర్చలు జరిపానని, అయితే సరైన సమాధానాలు దొరకలేదని, దీంతో తనకు పార్టీ సిద్ధాంతాలపై ప్రతికూల భావన పెరుగుతూ వచ్చిందని ఆయన అన్నారు. 

click me!