Prashant Kishor: సోనియా ఆఫర్‌కు ప్రశాంత్ కిషోర్‌ నో చెప్పడానికి కారణాలు ఇవేనా..?

Published : Apr 26, 2022, 05:59 PM IST
Prashant Kishor: సోనియా ఆఫర్‌కు ప్రశాంత్ కిషోర్‌ నో చెప్పడానికి కారణాలు ఇవేనా..?

సారాంశం

గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరిపిన పీకే.. సడన్‌గా పార్టీలో చేరేందుకు నిరాకరించారు. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ వైపు నుంచి, పీకే వైపు నుంచి ప్రకటనలు కూడా వెలువడ్డాయి. అయితే కాంగ్రెస్‌లో చేరేందుకు పీకే నిరాకరించడం వెనక.. పలు కారణాలు వినిపిస్తున్నాయి. అవేంటో చూద్దాం..

ఎన్నికల వ్యుహకర్త ప్రశాంత్ కిషోర్.. కాంగ్రెస్ పార్టీ మధ్య గత కొంతకాలంగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడింది. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పీకే నిరాకరించారు. ఈ మేరకు ఆయన స్వయంగా నేడు సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఆహ్వానాన్ని తిరస్కరించానని చెప్పారు. ఈ సందర్భంగా ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్‌లో చేరాలని, ఎన్నికల బాధ్యతలు తీసుకోవాలని కాంగ్రెస్ చేసిన ప్రతిపాదనను తాను తిరస్కరించానని చెప్పారు. అయితే ఇన్ని రోజు పాటు కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరిపిన పీకే.. ఇప్పుడు సడన్‌గా పార్టీలో చేరేందుకు నిరాకరించడం వెనక పలు కారణాలు వినిపిస్తున్నాయి. అవేంటో చూద్దాం..

కాంగ్రెస్ అధిష్టానంతో చర్చల సందర్బంగా తనకు ఫ్రీ హ్యాండ్ (పార్టీలో స్వేచ్చ) ఇవ్వాలని పీకే కోరినట్టుగా తెలిసింది. 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు కొత్త మఖం, పరివర్తన వ్యుహం అవసరమని పీకే చేసిన సిఫార్సులకు కాంగ్రెస్ అధిష్టానం అంతర్గతంగా అంగీకరించినప్పటికీ.. స్వేచ్చనిచ్చేందుకు నిరాకరించిందని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు ఆంగ్ల మీడియా సంస్థలు పేర్కొన్నాయి. అయితే కాంగ్రెస్‌కు, ప్రశాంత్ కిషోర్ మధ్య.. సఖ్యత కుదరకపోవడానికి మరికొన్ని కారణాలు కూడా రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. 

-కొద్ది రోజుల పాటు కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరిపన ప్రశాంత్ కిషోర్.. తెలంగాణకు వచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కూడా సుధీర్ఘంగా మంతనాలు జరిపారు. అంతేకాకుండా తనకు చెందిన ఐప్యాక్ సంస్థ సేవలు అందిస్తున్న పార్టీల నాయకులతో ఆయన సంప్రదింపులు జరిపినట్టుగా తెలిసింది. అయితే ఈ పరిణామాలను కాంగ్రెస్ పార్టీ నాయకులను అసంతృప్తికి గురిచేశాయి. టిఆర్‌ఎస్‌తో ఐ-ప్యాక్ ఒప్పందాన్ని కూడా కాంగ్రెస్ అధిష్టానం తీవ్రంగా పరిగణించిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధిష్టానంప్రశాంత్ కిషోర్‌ను  పూర్తిగా నమ్మి కీలక బాధ్యతలు అప్పగించడానికి సుముఖంగా లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాకుండా పార్టీలో సీనియర్లను కాదని.. కొత్తగా ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్న వ్యక్తికి కీలక బాధ్యతలు అప్పగించే అంశాన్ని పార్టీలోని పలువురు నేతలు వ్యతిరేకించారు. 

-ఎన్నికల వ్యుహకర్తగా దేశంలోని పలు పార్టీలకు సేవలు అందిస్తున్న ప్రశాంత్ కిషోర్.. గత కొంతకాలంగా రాజకీయంగా చక్రం తిప్పాలని ప్రణాళికలు రచిస్తున్నట్టుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాజకీయంగా కీలక పదవులు చేపట్టాలనే కోరిక కూడా అతనిలో ఉందనేది వారి అభిప్రాయం. బీజేపీ వ్యతిరేక కూటమికి కూడా ఆయన వ్యుహరచన చేస్తున్నారనే వార్తలు ఇందుకు బలం చేకూర్చేలా ఉన్నాయి. పీకే సలహాతోనే మమతా బెనర్జీ.. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారనే వారు కూడా లేకపోలేదు. 

కాంగ్రెస్ పార్టీలో లోపాలు..
2014లో కేంద్రంలో అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు తన ప్రభను కోల్పోతుంది. దేశంలో ప్రస్తుతం కేవలం రెండు రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ సొంతంగా అధికారంలో ఉంది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమిని చవిచూసింది. అయితే క్షేత్ర స్థాయిలో పరిస్థితిపై అధినాయకత్వాని పట్టులేకపోవడం.. పార్టీ రోజురోజుకు దిగజారిపోవడానికి కారణమనే చెప్పాలి. అంతేకాకుండా పార్టీ నాయకుల మధ్య కుమ్ములాటలు, మితిమీరిన స్వేచ్చ, లాబీయింగ్‌లు.. ఇలా ప్రతి ఒక్కటి కాంగ్రెస్ పార్టీ ఓటములకు కారణమనే చెప్పాలి.

ఓటమి తర్వాత సమీక్షలు జరిపే కాంగ్రెస్ అధిష్టానానికి.. కిందిస్థాయి నేతలనే అందుకు బాధ్యులుగా చేయడం అలవాటు అయిపోయింది. రాష్ట్రా స్థాయిలో పీసీసీ చీఫ్‌లను మర్చడమనేది సహజ ప్రక్రియగా మారిందనే చెప్పాలి. అయితే పార్టీ సీడబ్ల్యూసీ, అధినాయకత్వంలో మార్పులకు మాత్రం కాంగ్రెస్ పట్టించుకోదనే విమర్శలు ఉన్నాయి. గ్రౌండ్‌ స్థాయిలో రియాలిటీ తెలియని నేతలే.. కాంగ్రెస్‌లో కీలక పదవుల్లో ఉన్నారని కూడా రాజకీయవర్గాలు చెబుతుంటాయి. 

అయితే ఇలాంటి గ్రాండ్ ఓల్డ్ పార్టీలో సీనియర్ నేతలపై పెత్తనం చెలాయించే బాధ్యతలను ప్రశాంత్ కిషోర్‌కు కాంగ్రెస్ అంగీకరిస్తుందని భావించడం అతిశయోక్తే అని అంటున్నారు. సుర్జేవాలే ట్వీట్‌ను పరిశీలిస్తే.. నిర్వచించిన బాధ్యతలను చేపట్టాలని కాంగ్రెస్ కోరినట్టుగా చెప్పారు. అంటే పీకే కాంగ్రెస్ పార్టీలో చేరితే అతనికి అప్పగించిన బాధ్యతలకు మాత్రమే పరిమితం కావాల్సి వస్తుందని.. క్షేత్ర స్థాయిలో తాను అనుకున్న ప్రణాళికలు అమలు చేయడం కుదరదనే భావించి ఉంటారని.. అందుకే సోనియా ఆఫర్‌ను తిరస్కరించారనే చర్చ సాగుతుంది. 

ప్రశాంత్ కిషోర్‌ కూడా తన ట్వీట్‌లో.. కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం తనకంటే.. సమర్ధవంతమైన నాయకత్వం అవసరమని అభిప్రాయపడ్డారు. సంస్కరణల ద్వారా పార్టీలో క్షేత్ర స్థాయిలో నిర్మాణ సమస్యలను పరిష్కరించడానికి.. పార్టీకి నాయకత్వం, సమిష్టి సంకల్పం అవసరం ఉందని భావిస్తున్నట్టుగా చెప్పారు. ఈ రకమైన కాంగ్రెస్‌లో సమస్యలు ఉన్నాయని.. అవి పరిష్కారం అయితేనే పార్టీకి భవిష్యత్తు ఉంటుందని పీకే పరోక్షంగా కామెంట్ చేశారని కొందరు చెబుతున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం