విషమంగానే ప్రణబ్ ఆరోగ్యం: కోలుకోవాలంటూ కుమార్తె ప్రార్థనలు, మృత్యుంజయ హోమం

By Siva KodatiFirst Published Aug 12, 2020, 3:39 PM IST
Highlights

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. ఆయనకు ఇంకా వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నట్లు ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి.

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. ఆయనకు ఇంకా వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నట్లు ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి.

ఈ నేపథ్యంలో ప్రణబ్ త్వరగా కోలుకోవాలంటూ ఆయన కుమార్తె షర్మిష్టా ముఖర్జీ ప్రార్థించారు. తన తండ్రి ఆరోగ్యం మరింత క్షీణించడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

‘‘ సరిగ్గా గత సంవత్సరం ఆగస్టు 8న తాను ఎంతో సంతోషంగా ఉన్నాను... ఆ రోజు మా నాన్న భారత రత్న అవార్డును అందుకున్నారు. కానీ సరిగ్గా ఏడాదికి ఆయన అనారోగ్యానికి గురయ్యారు.

ఈ సమయంలో దేవుడు ఆయనకు మంచి చేయాలని కోరుకుంటున్నాను. తన తండ్రికి ధైర్యాన్ని, బాధను తట్టుకునే శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్లు షర్మిష్టా ట్వీట్ చేశారు. అలాగే తన తండ్రి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్న వారందరికీ ఆమె ధన్యవాదాలు తెలియజేశారు.

కాగా సోమవారం ప్రణబ్ ముఖర్జీకి బ్రెయిన్  సర్జరీ జరిగింది. మెదడులో బ్లడ్ క్లాట్ కావడంతో ఆపరేషన్ చేసినట్లు ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. అయితే సర్జరీ తర్వాత కూడా ప్రణబ్ ఆరోగ్యంలో ఎలాంటి మార్పు కనిపించలేదని, అంతేకాకుండా ఆరోగ్య పరిస్ధితి మరింత క్షీణించిందని వైద్యులు వెల్లడించారు.

మరోవైపు ప్రణబ్ కోలుకోవాలని పశ్చిమ బెంగాల్‌లోని ఆయన పూర్వీకుల గ్రామంలో మహా మృత్యుంజయ యజ్ఞాన్ని ప్రారంభించారు. ప్రణబ్ ముఖర్జీ కరోనా బారినపడినట్లు ఆయన కార్యాలయం సోమవారం వెల్లడించిన సంగతి తెలిసిందే. 
 

click me!