నాలుగు సార్లు వరుస విజయాలు సాధించిన ప్రహ్లాద్ జోషి .. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి గెలిచి ఐదోసారి పార్లమెంట్‌లో అడుగుపెట్టాలని కృతనిశ్చయంతో వున్నారు. బీజేపీకి వీరవిధేయుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన కర్ణాటకలోని ధార్వాడ్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు . ఈద్గా మైదాన్‌లో జాతీయ జెండాను ఎగురవేడంతో పాటు 1992 నుంచి 1994 వరకు హుబ్లీలో ‘‘సేవ్ కాశ్మీర్ ఉద్యమం ’’ వంటి కార్యక్రమాల ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2009లో ధార్వాడ్ లోక్‌సభ స్థానం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు ప్రహ్లాద్ జోషినే గెలుస్తూ వస్తున్నారు. ఐదోసారి విజయం సాధించాలని భావిస్తున్న ప్రహ్లాద్ జోషి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
నరేంద్ర మోడీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక ఏర్పాటు చేసిన కేబినెట్‌లో కీలక మంత్రిత్వ శాఖలను నిర్వర్తిస్తున్న వారిలో ప్రహ్లాద్ జోషి ఒకరు. బీజేపీకి వీరవిధేయుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన కర్ణాటకలోని ధార్వాడ్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. నాలుగు సార్లు వరుస విజయాలు సాధించిన ఆయన.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి గెలిచి ఐదోసారి పార్లమెంట్‌లో అడుగుపెట్టాలని కృతనిశ్చయంతో వున్నారు. ఈ నేపథ్యంలో ప్రహ్లాద్ జోషి రాజకీయ ప్రస్థానాన్ని ఒకసారి పరిశీలిస్తే..
ప్రహ్లాద్ జోషి బాల్యం, విద్యాభ్యాసం :
నవంబర్ 27, 1962న కర్ణాటకలోని విజయపురలో వెంకటేష్ జోషి, మాలతీబాయి దంపతులకు ఆయన జన్మించారు. హుబ్లీలోని కేఎస్ ఆర్ట్స్ కళాశాల నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పొందారు. రాజకీయాల్లోకి రాకముందు ప్రహ్లాద్ జోషి వ్యాపారవేత్త. ఈద్గా మైదాన్‌లో జాతీయ జెండాను ఎగురవేడంతో పాటు 1992 నుంచి 1994 వరకు హుబ్లీలో ‘‘సేవ్ కాశ్మీర్ ఉద్యమం ’’ వంటి కార్యక్రమాల ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఈ ఉద్యమాలు ప్రహ్లాద్ జోషికి ఆ ప్రాంతంలో మంచి గుర్తింపు రావడానికి కారణమయ్యాయి. తర్వాతి రోజుల్లో ఆయన ధార్వాడ్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
ప్రహ్లాద్ జోషి రాజకీయ ప్రస్థానం :
2004లో తొలిసారిగా ధార్వాడ్ నార్త్ నియోజక వర్గం నుంచి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్ధి బీఎస్ పాటిల్‌ను 83,078 ఓట్ల తేడాతో ఓడించారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా గతంలో వున్న ధార్వాడ్ నార్త్ లోక్‌సభ స్థానాన్ని రద్దు చేసి .. ధార్వాడ్ లోక్‌సభ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. 2009లో ధార్వాడ్ లోక్‌సభ స్థానం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు ప్రహ్లాద్ జోషినే గెలుస్తూ వస్తున్నారు. 2019లో నరేంద్ర మోడీ రెండో సారి ప్రధానిగా గెలుపొందిన తర్వాత ఆయన కేబినెట్‌లో పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, మైనింగ్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2014 నుంచి 2016 వరకు కర్ణాటక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగానూ ప్రహ్లాద్ జోషి పనిచేశారు. జ్యోతి జోషిని ప్రహ్లాద్ పెళ్లాడారు. ఈ దంపతులకు ముగ్గురు సంతానం.
ఐదోసారి విజయం సాధించాలని భావిస్తున్న ప్రహ్లాద్ జోషి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ తరపున వినోద్ అసూతిని ఆయన ఈసారి ఎదుర్కోనున్నారు. అయితే నియోజకవర్గంలో బలమైన వీరశైవ లింగాయత్‌లు ప్రహ్లాద్ జోషిపై గుర్రుగా వున్నారు. ఈ కమ్యూనిటీ పెద్దలంతా సమావేశమై జోషిని వ్యతిరేకించాలని నిర్ణయించుకోవడం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. ధార్వాడ్ జిల్లా శిరహట్టి మఠానికి చెందిన బాలెహూసూర్ దింగాళేశ్వర స్వామి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.