డీజే సౌండ్‌‌కు 63 కోళ్లు మృతి.. పోలీసులకు ఫిర్యాదు చేసిన పౌల్ట్రీ ఫామ్ ఓనర్

Published : Nov 24, 2021, 01:30 PM ISTUpdated : Nov 24, 2021, 01:36 PM IST
డీజే సౌండ్‌‌కు 63 కోళ్లు మృతి.. పోలీసులకు ఫిర్యాదు చేసిన పౌల్ట్రీ ఫామ్ ఓనర్

సారాంశం

డీజే సౌండ్ (DJ Music) కారణంగా  63 కోళ్లు మరణించాయని  పౌల్ట్రీ ఫామ్ (poultry farm) ఓనర్ పోలీసులను ఆశ్రయించాడు. తన పొరుగువారి వివాహ వేడుకే ఇందుకు కారణమని ఆరోపించాడు. 

ఓ పౌల్ట్రీ ఫామ్ (poultry farm) ఓనర్ చేసిన ఫిర్యాదు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే.. తన ఫారమ్‌లో డీజే సౌండ్ (Loud DJ Music) కారణంగా  63 కోళ్లు మరణించాయని అతడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన ఒడిశాలోని బాలాసోర్‌లో (Balasore) చోటుచేసుకుంది. నీలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని కందగరడి గ్రామానికి చెందిన పౌల్ట్రీ ఫారమ్ యజమాని రంజిత్ పరిదా ఈ ఫిర్యాదు చేశాడు. తన పొరుగువారి వివాహ వేడుకే కారణమని ఆరోపించాడు. వివాహ ఊరేగింపులో డీజే శబ్దాలు ఎక్కువగా ఉండటంతో తన కోళ్లు చనిపోయాయని చెప్పాడు. 

‘రామచంద్ర పరిదా వివాహ ఊరేగింపు ఆదివారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో నా పొలం ముందు నుంచి సాగింది. ఈ వేడుకల్లో చాలా పెద్ద శబ్దంతో డీజేను వినియోగించారు. అయితే డీజే నా పొలం వద్దకు చేరుకోగానే కోళ్లు వింతగా ప్రవర్తించడం ప్రారంభించాయి. కొని ఎగరడం, మరికొన్ని నీరసంగా అయిపోవడం కనిపించింది. డీజే వాల్యూమ్ తగ్గించమని చెప్పిన కూడా వారు వినిపించుకోలేదు. చెవిని చీల్చేలా సంగీతం ప్లే చేశారు. ఫలితంగా 63 కోళ్లు చనిపోయాయి’ అని రంజిత్ పేర్కొన్నాడు. 

కోళ్లు కుప్పకూలడంతో వాటిని బతికించేందుకు తాను చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని రంజిత్ చెప్పాడు. స్థానిక పశు వైద్యుడు కోళ్లను పరిశీలించి.. పెద్ద శబ్దం కారణంగా అవి చనిపోయానని నిర్దారించినట్టుగా తెలిపాడు. తన కోళ్లు గుండెపోటుతో మరణించాయని ఆరోపించాడు. ఇక, బాలాసోర్‌కు చెందిన రంజిత్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేశాడు. అతనికి ఉద్యోగం లభించకపోవడంతో 2019లో నీలగిరిలోని సహకార బ్యాంకులో రూ.2 లక్షలు లోన్‌ తీసుకుని కోళ్ల ఫామ్‌ పెట్టుకున్నాడు. 

కోళ్ల మృతికి సంబందించి రంజిత్.. రామచంద్ర వద్దకు వెళ్లి నష్టపరిహారం ఇప్పించాలని కోరాడు. అందుకు రామచంద్ర నిరాకరించాడు. అంతేకాకుండా రంజిత్ చేసిన వ్యాఖ్యలను రామచంద్ర హేళన చేశాడు. రోడ్డుపై రోజు లక్షల కోళ్ల రవాణా జరుగుతుందని.. భారీ శబ్దాలు(హారన్స్) మధ్య రవాణా చేస్తున్నప్పుడు పక్షులు ఎందుకు చనిపోవడం లేదని బదులిచ్చాడు. డీజే సంగీతం వల్ల పక్షులు ఎలా చనిపోతాయని ప్రశ్నించాడు. రంజిత్ తన వద్దకు వచ్చి సౌండ్ తగ్గించమని కోరినప్పుడు.. తాము వాల్యూ తగ్గించామని చెప్పాడు. 

ఈ క్రమంలోనే  పెద్ద శబ్దం, బాణసంచా వల్ల పక్షులు షాక్‌కు గురై చనిపోయాయని ఆరోపిస్తూ రామచంద్రపై నీలగిరి పోలీస్ స్టేషన్‌లో (Nilagiri police station) రంజిత్ ఫిర్యాదు చేశాడు. అయితే ఆ తర్వాత ఇరువర్గాలు సామరస్య పూర్వకంగా పోలీస్ స్టేషన్‌లో ఈ సమస్యను పరిష్కరించుకున్నాయని పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్