
మహారాష్ట్రలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు కుట్ర జరుగుతోందని మహారాష్ట్ర హోం శాఖ తెలిపింది. ఈ అల్లర్ల కోసం ఇతర రాష్ట్రాల నుంచి వ్యక్తులు అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ కు సమాచారం అందిందని మంగళవారం చెప్పింది. ఈ విషయంలో శివసేన సీనియర్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలను తీసుకువస్తున్నట్టు తనకు తెలిసిందని, అల్లర్లకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
‘‘ఇది మహారాష్ట్ర. దీనికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతోంది. రాష్ట్రం వెలుపల నుండి ప్రజలను తీసుకువస్తున్నారని, అల్లర్లకు కుట్ర జరుగుతోందని నాకు సమాచారం ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులకు దీనిని ఎదుర్కొనే సామర్థ్యం ఉంది.’’ అని సంజయ్ రౌత్ అన్నారు.
శాంతిభద్రతల పరిస్థితిపై మహారాష్ట్ర హోంమంత్రి దిలీప్ వాల్సే పాటిల్ మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు పాటిల్ వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు అన్ని చర్యలు తీసుకోవాలని, ఎవరి ఆదేశాల కోసం వేచి ఉండవద్దని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆయన మహారాష్ట్ర డీజీపీ రజనీష్ సేథ్ తో ఫోన్ లో మాట్లాడి శాంతిభద్రతల పరిస్థితిపై చర్చించారు.
మత సామరస్యానికి భంగం కలిగించే ప్రయత్నం చేసేవారిపై తాము చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర పోలీసు చీఫ్ రజనీష్ సేత్ ఈ రోజు తేల్చి చెప్పారు. మసీదుల పైన లౌడ్ స్పీకర్లకు వ్యతిరేకంగా మే 4 నుంచి నిరసన తెలుపుతామని ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే ప్రకటించిన తరువాత డీజీపీ నుంచి ఈ ప్రకటన వచ్చింది. ‘‘ మహారాష్ట్ర పోలీసులు ఎలాంటి శాంతి భద్రతల సమస్యలైనా ఎదుర్కొనే సామర్థ్యం కలిగి ఉన్నారు.’’ అని చెప్పారు. ఎస్ఆర్పీఎఫ్, హోంగార్డులను రాష్ట్రంలో మోహరించినట్లు ఆయన తెలిపారు. ప్రతీ ఒక్కరూ శాంతిని కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పరిస్థితిని చక్కదిద్దడానికి పోలీసులు పూర్తిగా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అల్లర్లు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని ఆయన చెప్పారు.