రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై ప్రశాంత్ కిశోర్ ఆసక్తికర వ్యాఖ్యలు

By Mahesh KFirst Published Sep 20, 2022, 8:39 PM IST
Highlights

కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భారత్ జోడ్ యాత్రపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ సారథ్యంలో జరుగుతున్న ఈ యాత్ర తమిళనాడు నుంచి కాకుండా త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్ నుంచి లేదా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి ప్రారంభిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
 

న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ఈ యాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల కోసం పార్టీ దాని జవసత్వాలను కూడదీసుకోవడానికి ఇదొక ప్రయత్నంగా తెలుస్తున్నది. అలాగే, పార్టీ చీఫ్ ఎన్నిక జరుగుతున్న తరుణంలో ఈ యాత్రకు ప్రాధాన్యత ఏర్పడింది. కాంగ్రెస్ చేపడుతున్న ఈ యాత్రపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రాహుల్ గాంధీ ఈ యాత్రను తమిళనాడు నుంచి ప్రారంభించారు. ఈ విషయాన్ని ప్రశాంత్ కిశోర్ ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్రను తమిళనాడు నుంచి కాకుండా గుజరాత్ నుంచి లేదా బీజేపీ పాలిత ఇతర రాష్ట్రాలు యూపీ లేదా మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి ప్రారంభిస్తే బాగుండేదని తెలిపారు. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాదిలోనే జరగనున్నాయని ఆయన గుర్తు చేశారు.

ప్రశాంత్ కిశోర్ మంగళవారం మహారాష్ట్ర వెళ్లారు. మహారాష్ట్రలో ప్రత్యేక విదర్భ రాష్ట్రం కోసం ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ ప్రత్యేక విదర్భ రాష్ట్రం కోసం నిర్వహించిన క్యాంపెయిన్‌లో ప్రశాంత్ కిశోర్ మంగళవారం పాల్గొన్నారు. మహారాష్ట్ర తూర్పు రీజియన్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటానికి వ్యూహాన్ని రూపొందించాలనే ఉద్దేశంతో మాజీ బీజేపీ ఎమ్మెల్యే అశిశ్ దేశ్‌ముఖ్ ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో ప్రశాంత్ కిశోర్ మాట్లాడారు. ప్రజలకు ఆ లక్ష్యం, ఆశ ఉంటే.. విదర్భ ప్రత్యేక రాష్ట్రం ఆలోచనను ముందుకు తీసుకెళ్లవచ్చని అన్నారు. అయితే, ఆ ప్రత్యేక రాష్ట్ర ఆందోళన కేంద్రానికి చేరాలని చెప్పారు. ఈ ఉద్యమ ప్రభావం యావత్ దేశంపై పడాలని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆ ఉద్యమం సమాజంలో నుంచి పుట్టుకు రావాలని వివరించారు.

తాను రాజకీయ వ్యూహకర్త పని చేయడాన్ని మానుకున్నట్టు పీకే చెప్పారు. తాను ఏ పార్టీ కోసం పని చేయాలని భావించడం లేదని, కేవలం ప్రజల కోసం శ్రమించాలని నిర్ణయం వివరించారు.

ప్రశాంత్ కిశోర్ గతంలో కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ఊహాగానాలు వచ్చాయి. సోనియా గాంధీతోనూ ఆయన భేటీ అయ్యారు. పార్టీలో చేరితే తన వ్యూహకర్తగా చేసే పనులను వదిలిపెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ అల్టిమేటం పెట్టినట్టు అప్పట్లో కథనాలు వచ్చాయి. ఈ షరతు వల్లనే ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరకుండా విరమించుకున్నట్టు సమాచారం.

click me!