చిన్న గొడవ, ఆపాలని ప్రయత్నించిన పోలీసులపై కిరోసిన్ పోసి..

By telugu news teamFirst Published May 2, 2020, 11:04 AM IST
Highlights

మద్దతుదారులతో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్న సురేష్ ట్యాంకర్‌ డ్రైవర్‌ మురుగన్‌ను చితకబాదాడు. అంతటితో ఆగకుండా అతడ్ని వారి ప్రాంతానికి తీసుకెళ్లి కట్టి పడేశాడు.
 

ఓ చిన్న గొడవ కారణంగా ఇద్దరు అన్న దమ్ములు ఓ లారీ డ్రైవర్ ని కట్టేసి చితకబాదారు. దీంతో.. ఆ డ్రైవర్ ని రక్షించేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో సదరు అన్నదమ్ములు.. పోలీసులను కూడా చంపాలని చూశారు. ఆ పోలీసులపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టాలని చూశారు. ఈ దారుణ సంఘటన తమిళనాడు లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

చెన్నై కొడంగయూరు చిత్తాడి మఠంకు చెందిన కృష్ణమూర్తి(28) శుక్రవారం ఉదయం మోటారు సైకిల్‌ మీద వెళ్తుండగా, ట్యాంకర్‌ లారీ ఢీకొంది. దీంతో అతడు స్వల్పంగా గాయపడ్డాడు. తనను లారీ ఢీకొన్నట్టు తన సోదరుడు సురేష్‌కు సమాచారం ఇచ్చాడు. దీంతో మద్దతుదారులతో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్న సురేష్ ట్యాంకర్‌ డ్రైవర్‌ మురుగన్‌ను చితకబాదాడు. అంతటితో ఆగకుండా అతడ్ని వారి ప్రాంతానికి తీసుకెళ్లి కట్టి పడేశాడు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న కొడంగయూరు ఎస్‌ఐ పళని నేతృత్వంలో ముగ్గురు పోలీసులు, జీపు డ్రైవర్‌ మణికంఠన్‌ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డ్రైవర్‌ను విడిచి పెట్టాలని సూచించినా, అన్నదమ్ములు వినిపించుకోలేదు. దీంతో కృష్ణమూర్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన సోదరుడ్ని పోలీసులు జీపులో ఎక్కించడంలో ఆగ్రహానికి లోనైన సురేష్‌ కిరోసిన్‌ క్యాన్‌ తీసుకొచ్చి పోలీసుల మీద పోశాడు. తన సోదరుడ్ని విడిచిపెట్టకుంటే తగల బెట్టేస్తానని, సజీవదహనం చేస్తానని బెదిరించాడు.

దీంతో కంగారుపడిపోయిన పోలీసులు కృష్ణమూర్తిని వదిలిపెట్టారు. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు రంగంలోకి దిగి డ్రైవర్‌ను రక్షించారు. అదే సమయంలో అన్నదమ్ముళ్లతో పాటు వారి అనుచరులు అక్కడి నుంచి ఉడాయించారు. ఆ ఇద్దరి మీద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

click me!