బస్సులో పసికందు ఏడుపు.. సముదాయించలేక మహిళ అవస్థ.. ఆరాతీస్తే షాకింగ్ నిజాలు...

By AN TeluguFirst Published Aug 26, 2021, 11:24 AM IST
Highlights

కటనీ జిల్లా ఆస్పత్రిలో నుంచి ఒక 3 రోజుల శిశువును ఎవరో ఎత్తుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు అందింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజి పరిశీలించారు. ఒక మహిళ ఈ పసికందును ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. 

మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో దారుణం జరిగింది. చీకటి పడ్డాక ఓ గ్రామం మీదుగా ఓ బస్సు వెళ్తోంది. మధ్యలో పోలీసులు బస్సును చెక్ చేశారు. బస్సులోకి వెళ్లి ప్రయాణీకుల్ని పరిశీలిస్తున్నారు. ఇంతలో ఓ మూల ఉన్న సీట్లోంచి చిన్నారి ఏడుపు వినిపించింది. 

ఓ మహిళ అతన్ని సముదాయించే ప్రయత్నం చేస్తోంది. కానీ ఆ చిన్నారి ఎంతకూ ఏడుపు ఆపడం లేదు. దీంతో పోలీసులు ఆమె దగ్గరికి వెళ్లి ఎందుకు ఏడుపు ఆపడం లేదని ప్రశ్నించారు. వాళ్లను చూసి తత్తరపడిన ఆమె, ఏవేవో సాకులతో ఏదో సమాధానం చెప్పింది. పోలీసులకు అనుమానం వచ్చింది. ఆమెను బస్సు దింపారు.

గట్టిగా ప్రశ్నించారు. తీగ లాగితే డొంకంతా కదిలినట్టు.. పోలీసులు గట్టిగా ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. ఆమె దగ్గర ఉన్న ఇద్దరు పిల్లలు ఆమె సంతానం కాదు. వారిలో ఒక పసివాడు వయసు రెండున్నర నెలలు కాగా, మరో శిశువు వయసు కేవలం మూడ్రోజులే. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో వెలుగు చూసింది. 

కటనీ జిల్లా ఆస్పత్రిలో నుంచి ఒక 3 రోజుల శిశువును ఎవరో ఎత్తుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు అందింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజి పరిశీలించారు. ఒక మహిళ ఈ పసికందును ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. ఆమె కోసం గాలింపు చర్యల్లో భాగంగానే.. జబల్ పూర్ వెళ్తున్న బస్సును అడ్డుకున్నారు. ఆ బస్సులోనే ఇద్దరు పసివాళ్లతో ఆమె పోలీసులకు దొరికిపోయింది. పిల్లలతో పాటు ఆమె దగ్గర మూడు, నాలుగు చీరలు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

ఆ యువతి కటనీ జిల్లా ఆస్పత్రి ప్రసూతి వార్డులో చాలాసేపు ఉందని, పసివాడిని ఎత్తుకెళ్లే ముందు ఆ తల్లితో మాటలు కలిపిందని పోలీసులు తెలిపారు. ఆ బాలింత కుటుంబ సభ్యులు లేని సమయంలో ఆ శిశువును తీసుకుని పరారయ్యింది. ఆమె నుంచి ఇద్దరు పసివాళ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు, పసివాళ్లను వారి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. 

click me!