వ్యవసాయానికి ‘‘సాయం’’.. రేపు రైతుల ఖాతాల్లోకి రూ.19 వేల కోట్లు, 9.5 కోట్ల మందికి లబ్ధి

By Siva KodatiFirst Published May 13, 2021, 8:59 PM IST
Highlights

ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పీఎం-కిసాన్‌) కింద ఎనిమిదో విడత పెట్టుబడి సాయాన్ని ప్రధాని నరేంద్రమోడీ రేపు విడుదల చేయనున్నారు. ఈ విడతలో రూ. 19,000 కోట్లను 9.5 కోట్ల మందికి పైగా అన్నదాతలకు అందించనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది

ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పీఎం-కిసాన్‌) కింద ఎనిమిదో విడత పెట్టుబడి సాయాన్ని ప్రధాని నరేంద్రమోడీ రేపు విడుదల చేయనున్నారు. ఈ విడతలో రూ. 19,000 కోట్లను 9.5 కోట్ల మందికి పైగా అన్నదాతలకు అందించనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.

శుక్రవారం ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ సాయాన్ని మోడీ విడుదల చేయనున్నారు. దీనితో పాటు కొంతమంది లబ్ధిదారులతో ప్రధాని మోడీ మాట్లాడుతారని తెలిపింది. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ కూడా పాల్గొననున్నారు.   

రైతులు వేసే పంటలకు పెట్టుబడి సాయం నిమిత్తం 2019లో కేంద్రం పీఎం-కిసాన్‌ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. నాటి నుంచి 5 ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ. 6,000 పెట్టుబడి సాయాన్ని కేంద్రం మూడు వాయిదాల్లో విడుదల చేస్తోంది.

ప్రతి నాలుగు నెలలకోసారి రూ. 2 వేల చొప్పున ఈ సాయాన్ని అందిస్తోంది. ఈ మొత్తం నేరుగా రైతుల ఖాతాల్లోకే బదిలీ చేస్తోంది. కిసాన్‌ సమ్మాన్‌ ద్వారా ఇప్పటివరకు రూ. 1.15 కోట్లను అన్నదాతలకు అందించింది.   

మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వైఎస్సార్‌ రైతు భరోసా పథకం కింద ఇవాళ రైతుల ఖాతాల్లోకి తొలి విడత పెట్టుబడి సాయాన్ని జమ చేసింది. ఈ మేరకు గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి ఆన్‌లైన్ ద్వారా నిధులు విడుదల చేశారు.

రైతు భరోసా కింద ఈ ఏడాది 52,38,517 రైతు కుటుంబాలు అర్హత పొందాయి. దీంతో గతేడాదితో పోలిస్తే ఈసారి 79, 472 కుటుంబాలు అదనంగా ప్రయోజనం పొందనున్నాయి. వీరిలో 1,86, 254 మంది భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అటవీ సాగుదారులున్నారు.

click me!