దేశంలో కోవిడ్ తీవ్రతపై ప్రధాని మోడీ సమీక్ష: కీలక సూచనలు

By Siva KodatiFirst Published Jul 11, 2020, 5:06 PM IST
Highlights

దేశంలో కోవిడ్ 19 పరిస్థితిపై ప్రధాని నరేంద్రమోడీ సమీక్షా సమావేశం నిర్వహించారు. బహిరంగ ప్రదేశాల్లో వ్యక్తిగత పరిశుభ్రతను, సామాజిక క్రమశిక్షణను పాటించాల్సిన అవసరాన్ని పునరుద్ఘాటించాలని ప్రధాని ఆదేశించారు

దేశంలో కోవిడ్ 19 పరిస్థితిపై ప్రధాని నరేంద్రమోడీ సమీక్షా సమావేశం నిర్వహించారు. బహిరంగ ప్రదేశాల్లో వ్యక్తిగత పరిశుభ్రతను, సామాజిక క్రమశిక్షణను పాటించాల్సిన అవసరాన్ని పునరుద్ఘాటించాలని ప్రధాని ఆదేశించారు.

కోవిడ్ 19 గురించి విస్తృత అవగాహనతో పాటు, కరోనా సంక్రమణ వ్యాప్తిని అడ్డుకోవడానికి నిరంతర ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని సూచనలు చేశారు. దేశ రాజధానిలో కరోనా మహమ్మారి వ్యాప్తి పరిస్ధితిని అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర, స్థానిక అధికారుల అవిరళ కృషిని ప్రధాని ప్రశంసించారు.

ఎన్‌సీఆర్ అంటే జాతీయ రాజధాని ప్రాంతంలో కోవిడ్ 19 మహమ్మారిని అరికట్టిన విధానాన్నే, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అవలంభించాలని ప్రధాని మోడీ అన్నారు. ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్, నీతి ఆయోగ్ సభ్యులు, కేబినెట్ కార్యదర్శి, కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

కోవిడ్ నియంత్రణ చర్యలకు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు నిరంతర ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని సూచించారు. అదే విధంగా అహ్మదాబాద్‌లో ధన్వంతరి రథ్ పేరుతో నిర్వహిస్తున్న మొబైల్ క్లినిక్ సేవలను కూడా ప్రధాని ప్రశంసించారు.

దీనిని ఆదర్శంగా తీసుకుని ఇతర రాష్ట్రాల్లోనూ ఇటువంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. కోవిడ్ నిర్థారణ పాజిటివిటీ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో జాతీయ స్థాయి పర్యవేక్షణ, మార్గదర్శకాలు అందించాలని అధికారులను ఆదేశించారు. 

click me!