దీపావళీ వేడుకలు: ఈ సారి ఆ ప్రాంతాన్ని ఎంచుకున్న మోడీ

By Siva KodatiFirst Published Nov 13, 2020, 6:08 PM IST
Highlights

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీపావళి పర్వదినం సందర్భంగా తన అనవాయితీని ఈ సారి కూడా కొనసాగించబోతున్నారు. కుటుంబాలకు దూరంగా, ప్రాణాలను పణంగా పెట్టి, దేశ సరిహద్దుల్లో పహారా కాస్తోన్న జవాన్లతో ఆయన దీపావళి వేడుకలను జరుపుకోనున్నారు. 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీపావళి పర్వదినం సందర్భంగా తన అనవాయితీని ఈ సారి కూడా కొనసాగించబోతున్నారు. కుటుంబాలకు దూరంగా, ప్రాణాలను పణంగా పెట్టి, దేశ సరిహద్దుల్లో పహారా కాస్తోన్న జవాన్లతో ఆయన దీపావళి వేడుకలను జరుపుకోనున్నారు.

అయితే ఈ సారి మోడీ తన రూటు మార్చారు. ఉత్తర సరిహద్దులకు బదులుగా పశ్చిమ సరిహద్దులకు తరలి వెళ్లనున్నారు. ఏ ప్రదేశంలో ఆయన దీపావళి వేడుకల్లో పాల్గొంటారనే దానిపై సమాచారం లేదు.

అయితే గుజరాత్ లేదా రాజస్థాన్ సరిహద్దులకు ప్రధాని వెళ్లే అవకాశాలు ఉన్నాయి. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌, లేదా తన సొంత రాష్ట్రం గుజరాత్‌లోని భుజ్‌కు వెళ్తారని అంటున్నారు.

ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి దీపావళీకి ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. ప్రతి ఏడాది దీపావళి నాడు సరిహద్దులకు తరలి వెళ్తున్నారు.

ప్రతికూల వాతావరణంలోనూ మోడీ వెనుకంజ వేయలేదు. జవాన్లకు తన చేతుల మీదుగా స్వీట్ బాక్స్‌లను అందజేస్తున్నారు. దేశం మొత్తం వారి వెంట ఉందనే సందేశాన్ని జవాన్లకు ఇవ్వడానికే తాను వారితో కలిసి దీపావళి వేడుకలను జరుపుకొంటున్నానని మోడీ చాలాసార్లు చెప్పారు.

ఎప్పుడూ ఒకేచోటికి వెళ్లకుండా ప్రతి సంవత్సరం వేర్వేరు సరిహద్దు ప్రాంతాలను ఆయన ఎంచుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో కీలక ప్రదేశాలకు వెళ్లొచ్చారు.

ప్రధానమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తొలి ఏడాదే ఆయన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యుద్ధ క్షేత్రం సియాచిన్‌ను సందర్శించారు. 2015లో పంజాబ్ సరిహద్దుల్లో దీపావళి వేడుకలను జరుపుకొన్నారు. ఆ మరుసటి ఏడాది హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లి ఐటీబీపీ జవాన్లను కలిశారు.

2017లో జమ్మూ కాశ్మీర్‌లోని గురేజ్ సెక్టార్, 2018లో ఉత్తరాఖండ్‌లో భారత్-చైనా సరిహద్దులో విధులు నిర్వర్తిస్తున్న జవాన్లతో దీవాళీ వేడుకలను జరుపుకున్నారు. గతేడాది జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీ సెక్టార్‌ను సందర్శించారు. ఈ సారి పశ్చిమ సరిహద్దుల వైపు వెళ్లేందుకు రంగం సిద్దం చేసుకున్నారు.

click me!