హద్దు మీరిన దాయాది: ధీటుగా జవాబిస్తోన్న భారత్.. ఏడుగురు పాక్ సైనికులు హతం

By Siva KodatiFirst Published Nov 13, 2020, 5:16 PM IST
Highlights

భారత్- పాక్ సరిహద్దుల్లో భారీగా కాల్పులు జరుగుతున్నాయి. దాయాది దేశం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పాకిస్తాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో సరిహద్దుల్లోని ఆరుగురు చనిపోయారు. వీరిలో నలుగురు పౌరులు కాగా, మరో ఇద్దరు జవాన్లు ఉన్నారు. 

భారత్- పాక్ సరిహద్దుల్లో భారీగా కాల్పులు జరుగుతున్నాయి. దాయాది దేశం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పాకిస్తాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో సరిహద్దుల్లోని ఆరుగురు చనిపోయారు. వీరిలో నలుగురు పౌరులు కాగా, మరో ఇద్దరు జవాన్లు ఉన్నారు.

బారాముల్లా జిల్లా లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద పాక్.. పదే పదే కాల్పులకు తెగబడుతోంది. అటు పాకిస్తాన్ కాల్పులకు భారత్ ధీటుగా జవాబిస్తోంది. ఇండియన్ ఆర్మీ కాల్పుల్లో పలు పాకిస్తాన్ బంకర్లు ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. అటు వైపు ఏడు నుంచి 8 మంది హతమైనట్లుగా సమాచారం. పాక్ కాల్పుల్లో చనిపోయిన వారిలో బీఎస్ఎఫ్ ఎస్ఐ రాకేశ్ ధోవల్ వున్నారు. 

శుక్రవారం మధ్యాహ్నం 1.15 గంటల ప్రాంతంలో పాక్ బలగాలు భారత సైన్యంపై కాల్పులకు దిగాయి. ఈ కాల్పుల్లో రాకేశ్ తలకు తీవ్ర గాయం కావడంతో ఆయన అమరుడైనట్లు బీఎస్ఎఫ్ తెలిపింది. రాకేశ్ ధోవల్ స్వస్థలం ఉత్తరాఖండ్ రాష్ట్రంల రిషికేశ్‌లోని గంగా నగర్. మరోవైపు పాక్ వైపు నుంచి ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని ఓ అధికారి వెల్లడించారు.

ఉత్తర కాశ్మీర్‌లోని బందిపొర జిల్లాలోని గురేజ్ సెక్టర్‌, ఇజ్‌మార్గ్‌లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాకిస్థాన్ వైపు నుంచి కాల్పులు జరిగినట్లు సమాచారం.

ఈ సంఘటన జరిగిన కొద్ది క్షణాలకే కుప్వారా జిల్లాలోని కేరన్ సెక్టర్‌లోనూ, బారాముల్లా జిల్లాలోని ఉరి సెక్టర్‌లోనూ పాకిస్థాన్ దళాలు కాల్పులకు  తెగబడినట్లు తెలుస్తోంది. కేరన్ సెక్టర్‌లో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్లు గుర్తించి, చొరబాట్లను నిరోధించినట్లు చెప్పారు. 

పాకిస్థాన్ దళాలు కేరన్ సెక్టర్‌లో మోర్టార్లు, ఇతర ఆయుధాలతో దాడి చేసినట్లు తెలిపారు. పాకిస్థాన్ దళాల దుశ్చర్యలను భారతీయ దళాలు దీటుగా తిప్పికొట్టినట్లు తెలిపారు.

ఉగ్రవాదుల చొరబాటు యత్నాలు జరగడం ఈ వారంలో ఇది రెండోసారి అని పేర్కొన్నారు. ఈ నెల 7, 8 తేదీల్లో జరిగిన చొరబాటు యత్నాలను తిప్పికొట్టి, ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు తెలిపారు. 

click me!