అవినీతి, వారసత్వం భారత్‌ ముందున్న రెండు అతిపెద్ద సవాళ్లు.. ప్రధాని మోదీ

By Sumanth KanukulaFirst Published Aug 15, 2022, 1:23 PM IST
Highlights

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా  దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ.. అవినీతి, వంశపారంపర్యత భారతదేశం ఎదుర్కొంటున్న రెండు ప్రధాన సమస్యలని అన్నారు. వీటిని అధిగమించడానికి పోరాడాలని పిలుపునిచ్చారు.

భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటలో ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ.. అవినీతి, వంశపారంపర్యత భారతదేశం ఎదుర్కొంటున్న రెండు ప్రధాన సమస్యలని అన్నారు. వీటిని అధిగమించడానికి పోరాడాలని పిలుపునిచ్చారు. ఆశ్రిత పక్షపాతం దేశంలోని సంస్థలకు తూట్లు పొడుస్తోందని.. అనేక సందర్భాల్లో అవినీతికి దారితీస్తోందని అన్నారు. ‘‘అవినీతి దేశాన్ని చెదపురుగులా దెబ్బతీస్తోంది.. దేశం దానితో పోరాడాలి.. అవినీతిని పారద్రోలాలి’’ అని ప్రధాని మోదీ ఎర్రకోట వేదికగా పిలుపునిచ్చారు. 

అవినీతి‌కి పాల్పడేవారిని శిక్షించేందుకు అందరూ  సంఘటితంగా కలిసి రావాలని మోదీ పిలుపునిచ్చారు. దేశం విడిచి పారిపోయిన వ్యక్తుల ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని..  అవినీతిపై పోరాడేందుకు సహకరించాలని దేశ ప్రజలను కోరారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇటీవల జరిపిన దాడుల్లో రికవరీ అయిన డబ్బు గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘‘పేదరికానికి వ్యతిరేకంగా ప్రజలు పోరాడుతున్న భారతదేశం వంటి దేశంలో... ఒక వైపు నివసించడానికి స్థలం లేని ప్రజలు ఉన్నారు. మరోవైపు తమ డబ్బును కొందరికి స్థలం సరిపోవడం లేదు’’ అని మోదీ అన్నారు. 

ఇది మంచి పరిస్థితి కాదని.. అందువల్ల అవినీతికి వ్యతిరేకంగా పూర్తి శక్తితో పోరాడాలని అన్నారు. గత 8 సంవత్సరాలలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ అమలు ద్వారా తమ ప్రభుత్వం 2 లక్షల కోట్ల రూపాయలు ఆదా చేసిందని చెప్పారు. నేడు దేశంలో అవినీతిపై ద్వేషం కనిపిస్తోందని.. అయితే ఒక్కోసారి అవినీతిపరులపై ఉదారంగా వ్యవహరిస్తుండడం ఆందోళనకలిగించే అంశమని మోదీ అన్నారు. 

‘‘నేను బంధుప్రీతి గురించి మాట్లాడినప్పుడు.. నేను రాజకీయాల గురించి మాత్రమే మాట్లాడుతున్నానని ప్రజలు అనుకుంటారు. అయితే అది నిజం కాదు.  దురదృష్టవశాత్తూ రాజకీయ రంగంలోని ఆ దుర్మార్గం భారతదేశంలోని ప్రతి సంస్థలోనూ బంధుప్రీతిని పెంచింది. దేశంలోని అనేక సంస్థలను బంధుప్రీతి పట్టి పీడిస్తోంది. దేశ ప్రతిభను, సామర్థ్యాన్ని దెబ్బతీస్తోంది. అవినీతికి ఇది కూడా ఒక కారణం’’ అని మోదీ  అన్నారు. వారసత్వ రాజకీయాలు కేవలం కుటుంబ సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తాయని.. దేశ సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని అన్నారు.

‘‘వారసత్వం నీడ అనేక సంస్థలపై ఉంది. అనేక సంస్థలు కుటుంబ పాలన ద్వారా ప్రభావితం అవుతున్నాయి. అది మన ప్రతిభను, దేశ సామర్థ్యాలను దెబ్బతీస్తుంది. అలాగే అవినీతికి దారి తీస్తుంది... సంస్థలను రక్షించడానికి మనం దీనికి వ్యతిరేకంగా పోరాడాలి. భారతదేశ రాజకీయాలను, సంస్థలను వారసత్వ సంకెళ్ల నుండి ప్రక్షాళన చేద్దాం’’ అని మోదీ అన్నారు. 

రాజకీయాలను శుభ్రపరచాలని పిలుపునిచ్చిన మోదీ.. దేశాన్ని వారసత్వ రాజకీయాల నుండి విముక్తం చేయాలని, ప్రతిభ ఆధారంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. ఇక, కాంగ్రెస్‌పై బీజేపీ చేస్తున్న ఆరోపణలలో కుటుంబ పాలన అనేది ప్రధానమైనదిగా ఉంది. 
 

click me!