
కరోనా వ్యాక్సినేషన్ పంపిణీలో భారతదేశం మరో మైలురాయిని అధిగమించింది. దేశంలో కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ 200 కోట్లను దాటింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. శనివారం నాటికి మన దేశంలో మొత్తం 199.71 కోట్ల డోసులను పంపిణీ పూర్తి కాగా.. నేడు ఆ సంఖ్య 200 కోట్లను దాటింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్న కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయా.. దేశ ప్రజలకు అభినందనలు తెలిపారు. అందరి కృషి వల్లనే నేడు దేశం 200 కోట్ల వ్యాక్సిన్‌ల సంఖ్యను దాటిందని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం చరిత్రను లిఖించిందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయా అన్నారు. ఈ అసాధారణ విజయం చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. #200CroreVaccinations అనే హ్యాష్ ట్యాగ్‌ను జత చేశారు.
దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ 200 కోట్ల డోసుల మైలురాయిని అధిగమించడంపై ప్రధాని మోదీ కూడా హర్షం వ్యక్తం చేశారు. భారత్ మళ్లీ చరిత్ర సృష్టించిందని మోదీ ట్వీట్ చేశారు. వ్యాక్సిన్ డోసుల సంఖ్య 200 కోట్ల స్పెషల్ నెంబర్ దాటినందుకు భారతీయులందరికీ అభినందనలు తెలిపారు. భారతదేశం వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను వేగంగా మార్చడానికి సహకరించిన వారికి ఇది గర్వకారణమని చెప్పారు. ఇది COVID-19కి వ్యతిరేకంగా ప్రపంచ పోరాటాన్ని బలోపేతం చేసిందని స్పష్టం చేశారు.
వ్యాక్సిన్‌ను విడుదల చేసిన సమయంలో.. భారతదేశ ప్రజలు సైన్స్‌పై విశేషమైన విశ్వాసాన్ని ప్రదర్శించారని మోదీ గుర్తుచేశారు. మన వైద్యులు, నర్సులు, ఫ్రంట్‌లైన్ కార్మికులు, శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు, వ్యవస్థాపకులు సురక్షితమైన పరిస్థితులను నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించారు. తాను వారి స్పూర్తిని, సంకల్పాన్ని అభినందిస్తున్నానని పేర్కొన్నారు.
భారత్‌లో వ్యాక్సినేషన్..
గతేడాది జనవరి 16న భారతదేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించిన 18 నెలల తర్వాత భారత్.. 200 కోట్ల డోసుల పంపిణీని అధిగమించింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. వయోజన జనాభాలో 98 శాతం మంది కనీసం ఒక డోసు వ్యాక్సిన్ పొందారు. 90 శాతం మంది వ్యాక్సిన్ రెండు డోసులు పొందారు. మొత్తం డోస్‌లలో 48.9 శాతం మహిళలకు ఇవ్వగా, 51.5 శాతం పురుషులకు ఇవ్వబడింది.
రెండు డోసులు పూర్తి చేసుకున్న 18 నుంచి 59 ఏళ్ల వయసు వారికి ఈ ఏడాది ఏప్రిల్ నుంచి కేవలం ప్రైవేటు కేంద్రాల్లో ప్రికాషన్ డోసు పంపిణీ చేస్తున్నారు. తొలుత రెండు డోసులను ఉచితంగా పంపిణీ చేశారు. అయితే ప్రికాషన్ డోసుకు (బూస్టర్ డోస్) ఇందుకు డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. దీంతో కొందరు మాత్రం డబ్బు చెల్లించి బూస్టర్ డోస్ తీసుకుంటున్నారు. దీంతో ఇప్పటివరకు ఒక శాతం మంది మాత్రమే బూస్టర్ డోస్ తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ వేడుకల్లో భాగంగా 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా బూస్టర్ డోస్ ఇవ్వాలని నిర్ణయించింది. జూలై 15 నుంచి 75 రోజుల పాటు ఈ డ్రైవ్ కొనసాగుతుందని స్పష్టం చేసింది.