విద్యార్థి నాయకుడి నుంచి ఉప రాష్ట్రపతి వరకు.. వెంకయ్య నాయుడు జీవితంపై మోదీ ప్రత్యేక వ్యాసం

By Galam Venkata RaoFirst Published Jul 1, 2024, 10:46 AM IST
Highlights

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడికి ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన వెంకయ్య... ఉప రాష్ట్రపతి వరకు ఎదిగిన తీరును కొనియాడారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారని కీర్తిస్తూ ప్రత్యేక వ్యాసం రాశారు. అది మీకోసం... 

భారత పూర్వ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు నేడు 75వ ఏట అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. దీర్ఘాయుష్షుతో ఆరోగ్యంగా జీవించాలని కోరుకున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో వెంకయ్య నాయుడి జీవితం, సేవాస్ఫూర్తి, దేశ నిర్మాణం పట్ల అంకితభావం గురించి వివరిస్తూ ప్రధాని మోదీ వ్యాసం రాశారు. రాజకీయ రంగంలో ప్రారంభ దశ నుంచి ఉప రాష్ట్రపతిగా పదవీకాలం వరకు దేశ రాజకీయాల్లో ఎదురైన సంక్లిష్టతలను వెంకయ్య నాయుడు సమర్థంగా ఎదుర్కొని ఉదాహరణగా నిలిచారని కొనియాడారు. ఆయన వాగ్ధాటి, చతురత, అభివృద్ధి, సమస్యల పరిష్కారంపై దృఢమైన దృష్టి పార్టీలకు అతీతంగా గౌరవాన్ని తెచ్చిపెట్టిందన్నారు.

మోదీ రాసిన వ్యాసంలో ఇంకా ఏమన్నారంటే....

‘‘వెంకయ్య నాయుడు, నేనూ దశాబ్దాలుగా ఒకరికొకరు అనుబంధం కలిగి ఉన్నాం. మేము కలిసి పని చేశాం. ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఆయన జీవితంలో సాధారణంగా మిగిలిపోయిన విషయం ఏదైనా ఉందంటే, అది ప్రజలపై ప్రేమ. ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థి నాయకుడిగా వెంకయ్య రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆయనకున్న ప్రతిభ, శక్తి సామర్థ్యాలకు ఏ పార్టీ అయినా స్వాగతిస్తుంది.. కానీ ‘‘నేషన్ ఫస్ట్’’ అనే విజన్ నుంచి ప్రేరణ పొంది సంఘ్ పరివార్‌తో కలిసి పనిచేయడానికి ఇష్టపడ్డారని తెలిపారు. అలా ఆర్‌ఎస్‌ఎస్, ఏబీవీపీతో అనుబంధం పెంచుకున్న నాయుడు... ఆ తర్వాత జనసంఘ్, బీజేపీ బలోపేతానికి పనిచేశారు.’’

దాదాపు 50 ఏళ్ల క్రితం ఎమర్జెన్సీ విధించినప్పుడు యువకుడైన వెంకయ్య నాయుడు... ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో మునిగిపోయారు. లోక్‌నాయక్ జేపీని ఆంధ్రప్రదేశ్‌కి ఆహ్వానించినందుకు ఆయన జైలుకెళ్లారు. ప్రజాస్వామ్యం పట్ల ఈ నిబద్ధత ఆయన రాజకీయ జీవితంలో మళ్లీమళ్లీ కనిపిస్తుంది. 1980ల మధ్యలో, మహానటుడు ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ అనాలోచితంగా బర్తరఫ్ చేసినప్పుడు.. ప్రజాస్వామ్య సూత్రాల పరిరక్షణ ఉద్యమంలో ఆయన మళ్లీ ముందున్నారు.

వెంకయ్య నాయుడు ఎప్పుడూ ఆటుపోట్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. 1978 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ హవా ఉన్న సమయంలో యువ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఐదేళ్ల తర్వాత (1983లో) ఎన్టీఆర్ సునామీ రాష్ట్రాన్ని తుడిచిపెట్టినప్పుడు కూడా ఆయన బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ బలోపేతానికి మార్గం సుగమం చేశారు.

వెంకయ్య నాయుడి ప్రసంగం విన్నవారంతా ఆయన వక్తృత్వ నైపుణ్యాన్ని చాటుకుంటారు. ఆయన కచ్చితంగా మాటల మాంత్రికుడు, అలాగే పనిమంతుడు కూడా. యువ ఎమ్మెల్యేగా ఉన్న రోజుల నుంచి, శాసనసభ వ్యవహారాల్లో చూపిన కఠినత, తన నియోజకవర్గ ప్రజల కోసం మాట్లాడటం పట్ల గౌరవం పొందడం ప్రారంభించాడు. ఎన్టీఆర్ లాంటి దిగ్గజం ఆయన ప్రతిభను గుర్తించి, తన పార్టీలో చేర్చుకోవాలని కూడా కోరుకున్నారు, కానీ వెంకయ్య తన ప్రధాన సిద్ధాంతం నుంచి వైదొలగడానికి నిరాకరించారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీని బలోపేతం చేయడంలో, గ్రామాలకు వెళ్లి అన్ని వర్గాల ప్రజలతో మమేకం కావడంలో పెద్దన్న పాత్ర పోషించారు. అసెంబ్లీ వేదికగా పార్టీని నడిపించి, ఏపీ బీజేపీ అధ్యక్షుడయ్యారు.

1990వ దశకంలో బీజేపీ కేంద్ర నాయకత్వం వెంకయ్య కృషిని గుర్తించింది. 1993లో పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. అలా, జాతీయ రాజకీయాల్లో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు వెంకయ్య. యుక్త వయసులో అటల్ జీ, అద్వానీ జీల సందర్శనలను ప్రకటిస్తూ తిరిగేవారు. వారితో కలిసి నేరుగా పనిచేసిన గొప్ప అనుభం కూడా ఆయన సంపాదించారు. బీజేపీని అధికారంలోకి తీసుకురావడం, భారత మొట్టమొదటి బీజేపీ ప్రధానమంత్రిని చూడాలన్న లక్ష్యంపైనే ఆయన దృష్టి సారించారు. అలా, ఢిల్లీ వెళ్లిన తర్వాత వెనుదిరిగి చూసుకోకుండా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎదిగారు.

2000 సంవత్సరంలో అప్పటి ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ.. తన మంత్రివర్గంలోకి వెంకయ్య నాయుడిని చేర్చుకోవాలని ఆసక్తి చూపారు. అప్పుడాయన తక్షణమే గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు తన ప్రాధాన్యతను తెలియజేశారు. దీంతో అటల్ జీ సహా అందరూ అయోమయంలో పడ్డారు. ఏ పోర్ట్‌ఫోలియో కావాలని అడిగినప్పుడు స్పష్టంగా మొదటి ఎంపిక గ్రామీణాభివృద్ధి శాఖేనని ఆయన తెలియజేశారు. ఎందుకంటే వెంకయ్య.. రైతు బిడ్డ. ఆయన ప్రారంభ రోజులను గ్రామాల్లో గడిపారు. అందువల్లే ఆయన గ్రామాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేయాలని కోరుకున్నారు. అలా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా.. ‘ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన’ పక్కాగా అమలయ్యేలా కృషి చేశారు. 

ఆ తర్వాత 2014లో NDA ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మరోసారి వెంకయ్య నాయుడు కేంద్ర మంత్రి అయ్యారు. ఈసారి కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణం, పట్టణ పేదరిక నిర్మూలన లాంటి కీలకమైన శాఖల బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన హయాంలోనే స్వచ్ఛ భారత్ మిషన్‌తో పాటు పట్టణాభివృద్ధికి సంబంధించిన ముఖ్యమైన పథకాలను మోదీ ప్రభుత్వం ప్రారంభించింది. బహుశా, ఇంత విస్తృత కాలం పాటు గ్రామీణ, పట్టణాభివృద్ధికి కృషి చేసిన ఏకైక నాయకుల్లో ఒకరు వెంకయ్య నాయుడే.

‘‘ఈ క్రమంలో.. నేను 2014లో ఢిల్లీకి వచ్చినప్పుడు, దేశ రాజధానికి బయటి వ్యక్తిని. అంతకుముందు దశాబ్దంన్నర పాటు గుజరాత్‌లో పనిచేశాను. అలాంటి సమయాల్లో వెంకయ్య నాయుడి అంతర్దృష్టి నాకు చాలా ఉపయోగపడింది. ఆయన సమర్థవంతమైన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి... ఆయనకు ద్వైపాక్షికత సారాంశం తెలుసు. కానీ అదే సమయంలో పార్లమెంటరీ నిబంధనలు, నియమాల విషయానికి వస్తే ఆయన ఒక గీతను గీశారు’’ అని మోదీ గుర్తుచేశారు.

‘‘2017లో, ఎన్డీయే కూటమి ఆయన్ను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపాదించింది. మేము ఒక సందిగ్ధ పరిస్థితిని ఎదుర్కొన్నాం. ఆయనంతటి గొప్ప వ్యక్తి స్థానాన్ని ఎవరితో పూరించాలని ఆలోచించాం. కానీ అదే సమయంలో, ఉప రాష్ట్రపతి పదవికి వెంకయ్య నాయుడు కంటే మంచి అభ్యర్థి లేరనిపించింది. 

ఆ సమయంలో మంత్రి పదవికి, ఎంపీ పదవికి రాజీనామా చేసినప్పుడు వెంకయ్య నాయుడు చేసిన ప్రసంగాల్లో ఒక్కటి కూడా మర్చిపోలేను. పార్టీతో తనకున్న అనుబంధాన్ని, దాన్ని నిర్మించేందుకు చేసిన కృషిని గుర్తుచేసుకున్నప్పుడు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. అది ఆయన నిబద్ధత, అంకితభావానికి తార్కాణంగా చెప్పుకోవాలి. 

ఇక, ఉప రాష్ట్రపతి అయ్యాక.. వెంకయ్య నాయుడు సభా గౌరవం పెంచేలా అనేక చర్యలు చేపట్టారు. యువ ఎంపీలు, మహిళా ఎంపీలు, మొదటిసారి ఎంపీలు మాట్లాడేలా తగిన అవకాశం కల్పించి రాజ్యసభకు అత్యుత్తమ ఛైర్‌పర్సన్‌గా నిలిచారు. సభలో హాజరుపై ఎక్కువ దృష్టి పెట్టి.. కమిటీలను మరింత ప్రభావవంతంగా మార్చారు. సభలో చర్చ స్థాయిని కూడా పెంచారు.

ఆర్టికల్‌ 370, 35(ఎ)లను రద్దు చేస్తూ రాజ్యసభలో నిర్ణయాన్ని ప్రవేశపెట్టినప్పుడు, సభాధ్యక్షలు వెంకయ్య నాయుడే. అది ఆయనకు చాలా ఉద్వేగభరితమైన క్షణం.... ఎందుకంటే డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ యొక్క అఖండ భారతదేశం గురించి కలలు కన్న చిన్న పిల్లవాడు.. అది సాధ్యమవుతున్నప్పుడు రాజ్యసభ కుర్చీలో ఉన్నారు. 

పని, రాజకీయాలే కాకుండా... వెంకయ్య నాయుడు విపరీతమైన పాఠకుడు, రచయిత కూడా. ఉజ్వలమైన తెలుగు సంస్కృతిని ఢిల్లీ నగరానికి తీసుకొచ్చిన వ్యక్తిగానూ ఆయన పేరుపొందారు. ఆయన నిర్వహించే ఉగాది, సంక్రాంతి కార్యక్రమాలు అత్యంత ప్రతిష్టాత్మకమైనవి నిలిచిపోతాయి. వెంకయ్య నాయుడు ఆహారాన్ని ఇష్టపడే వ్యక్తిగా, ప్రజలకు ఆతిథ్యం ఇచ్చే వ్యక్తిగా నాకెప్పటి నుంచో తెలుసు. అలాగే, ఆయన స్వీయ నియంత్రణ కూడా అందరికీ కనిపిస్తుంది. వెంకయ్య నాయుడు ఇప్పటికీ బ్యాడ్మింటన్ ఆడటం, చురుగ్గా నడవడం శారీరక దృఢత్వం పట్ట నిబద్ధతను తెలియజేస్తుంది. 

ఉప రాష్ట్రపతి పదవి తర్వాత కూడా వెంకయ్య చురుకైన ప్రజా జీవితాన్ని గడిపారు. ఉద్వేగభరితమైన సమస్యలు, దేశవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపై నాకు ఫోన్‌ చేసి మాట్లాడతారు. మా ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక, ఇటీవల ఆయన్ను కలిశాను. ఆయన సంతోషించి.. నాకు, మా బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మైలురాయి సాధించినందుకు మరోసారి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యువ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, సేవ చేయాలనే అభిరుచి ఉన్న వారందరూ వెంకయ్య నాయుడు జీవితంలోని విలువలను నేర్చుకుని, అలవర్చుకోవాలి. ఆయనలాంటి వాళ్లే మన దేశాన్ని మరింత మెరుగ్గా, మరింత ఉత్సాహవంతంగా తీర్చిదిద్దుతున్నారు’’ అని ప్రధాని మోదీ తన వ్యాసంలో పేర్కొన్నారు.

click me!