చేతితో నేసిన జీ-20 లోగో.. తెలంగాణ నేత కార్మికునిపై మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ ప్రశంసలు..

By Sumanth KanukulaFirst Published Nov 27, 2022, 12:44 PM IST
Highlights

ప్రధాని మోదీ ఆదివారం తన నెలవారీ రేడియో కార్యక్రమం‘‘మన్ కీ బాత్’’ 95వ ఎపిసోడ్‌లో ప్రసంగిస్తూ..  జీ-20 సమ్మిట్‌ కోసం స్వయంగా చేతితో నేసిన లోగోను బహుమతిగా ఇచ్చిన  తెలంగాణకు చెందిన ఓ నేత కార్మికుడిపై ప్రశంసలు కురిపించారు.

తెలంగాణకు చెందిన ఓ నేత కార్మికుడిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోదీ ఆదివారం తన నెలవారీ రేడియో కార్యక్రమం‘‘మన్ కీ బాత్’’ 95వ ఎపిసోడ్‌లో ప్రసంగిస్తూ.. వచ్చే ఏడాది భారతదేశం నిర్వహించనున్న జీ-20 సమ్మిట్‌ కోసం స్వయంగా చేతితో నేసిన లోగోను బహుమతిగా ఇచ్చిన తెలంగాణకు చెందిన యెల్ది హరిప్రసాద్ గురించి ప్రస్తావించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన హరిప్రసాద్‌కు ఆయన నైపుణ్యాలపై మంచి పట్టును కలిగి ఉన్నారని చెప్పారు. ఈ అద్భుతమైన బహుమతిని చూసి తాను ఆశ్చర్యపోయానని ప్రధాని మోదీ అన్నారు. హరిప్రసాద్ ఈ ప్రతిభను తన తండ్రి నుంచి వారసత్వంగా పొందారని తెలిపారు.

‘‘మిత్రులారా.. నేను ఒక ప్రత్యేకమైన బహుమతిని సూచిస్తూ నేటి కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక నేత సోదరుడు ఉన్నారు.. యెల్ది హరిప్రసాద్ గారు. ఆయన తన స్వంత చేతులతో నేసిన ఈ జీ20 లోగోను నాకు పంపాడు. ఈ అద్భుతమైన బహుమతిని చూసి నేను ఆశ్చర్యపోయాను. హరిప్రసాద్ జీ తన కళలో ఎంత నిష్ణాతులు. ఆయన అందరి దృష్టిని ఆకర్షిస్తారు. చేతితో నేసిన జీ-20 లోగోతో పాటు హరిప్రసాద్ జీ నాకు ఒక లేఖ కూడా పంపారు. వచ్చే ఏడాది జీ-20 సదస్సుకు భారత్‌ ఆతిథ్యమివ్వడం గర్వించదగ్గ విషయమని అందులో రాశారు. దేశం సాధించిన ఈ విజయం ఆనందం మధ్య, అతను తన స్వంత చేతులతో జీ20కు సంబంధించి ఈ లోగోను సిద్ధం చేశారు. తన తండ్రి నుంచి ఈ అద్భుతమైన నేత ప్రతిభను వారసత్వంగా పొందిన ఆయన ఈ రోజు పూర్తి మక్కువతో దానిలో నిమగ్నమై ఉన్నారు’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 

 

Began today’s programme by talking about a very special gift I received from a weaver in Telangana and how it is an example of keen interest towards India’s G20 Presidency. pic.twitter.com/NSKgGroS9s

— Narendra Modi (@narendramodi)


‘‘కొన్ని రోజుల క్రితం నేను జీ-20 లోగోను, ప్రెసిడెన్సీ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌ను ప్రారంభించే విశేషాన్ని పొందాను. ఈ లోగో పబ్లిక్ పోటీ ద్వారా ఎంపిక చేయబడింది. హరిప్రసాద్ గారు పంపిన ఈ బహుమతి అందుకోగానే నా మదిలో మరో ఆలోచన వచ్చింది. తెలంగాణలోని ఒక జిల్లాలో కూర్చున్న వ్యక్తి కూడా జీ-20 వంటి శిఖరాగ్ర సదస్సుతో ఎంతగా కనెక్ట్ అయ్యాడో చూసి నేను చాలా సంతోషించాను. ఇంత పెద్ద సమ్మిట్‌కి దేశం ఆతిథ్యమిస్తున్నందుకు తమ హృదయాలు ఉప్పొంగిపోయాయని హరిప్రసాద్‌ వంటి చాలా మంది ఈరోజు నాకు లేఖలు పంపారు. పూణే నుంచి సుబ్బారావు చిల్లరా జీ, కోల్‌కతా నుండి తుషార్ జగ్‌మోహన్‌ల సందేశాన్ని కూడా నేను మీకు ప్రస్తావిస్తాను. జీ-20కి సంబంధించి భారతదేశం క్రియాశీలక ప్రయత్నాలను వారు ఎంతో ప్రశంసించారు.

జీ-20 సముహం ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతులు, ప్రపంచ వాణిజ్యంలో మూడు వంతులు, ప్రపంచ జీడీపీలో 85 శాతం భాగస్వామ్యం కలిగి ఉంది. మీరు ఊహించవచ్చు.. భారతదేశం ఇంత పెద్ద సమూహానికి, ఇంత శక్తివంతమైన సమూహానికి.. ఇప్పటి నుంచి 3 రోజులు అంటే డిసెంబర్ 1వ తేదీ నుంచి అధ్యక్షత వహించబోతోంది. భారతదేశానికి, ప్రతి భారతీయుడికి ఎంత గొప్ప అవకాశం వచ్చింది! ఆజాదీ కా అమృత్ కాల్ సమయంలో భారతదేశానికి ఈ బాధ్యత అప్పగించబడింది.. అందుకే ఇది మరింత ప్రత్యేకం అవుతుంది.

జీ-20 ప్రెసిడెన్సీ మాకు ఒక పెద్ద అవకాశంగా వచ్చింది. మేము ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలి. గ్లోబల్ గుడ్, ప్రపంచ సంక్షేమంపై దృష్టి పెట్టాలి. శాంతి,ఐక్యత, పర్యావరణం పట్ల సున్నితత్వం లేదా సుస్థిర అభివృద్ధి వంటివాటికి సంబంధించిన సవాళ్లకు భారతదేశం పరిష్కారాలను కలిగి ఉంది. “ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒక భవిష్యత్తు” అనే అంశం వసుధైవ కుటుంబానికి మా నిబద్ధతను తెలియజేస్తుంది’’ అని ప్రధాని మోదీ తన మన్ కీ బాత్‌లో పేర్కొన్నారు. 

click me!