
ఉక్రెయిన్‌లో (Ukraine) చిక్కుకున్న భారతీయులను (indians evacuations) తరలించేందుకు కేంద్రం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎయిరిండియా విమానాలకు తోడు వాయుసేనను రంగంలోకి దించింది. అలాగే ఉక్రెయిన్ సరిహద్దు దేశాలైన పోలాండ్, హంగేరి, రోమేనియా దేశాలకు నలుగురు కేంద్ర మంత్రులను పంపింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) స్వదేశీ మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ కూలో .. ఉక్రెయిన్ నుంచి భారతీయులను తరలించేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు సంబంధించి ఒక కార్టూన్‌ను పోస్ట్ చేశారు.
ఇందులో ప్రధాని మోడీ (narendra modi) నీటిలో సగం మునిగి వుండగా.. ఆయన రెండు చేతులను బాహుబలిలో ప్రభాస్ చాచినట్లు చాచారు. ఇందులో ఒక చేయి ఉక్రెయిన్‌ను, మరొకటి భారతదేశాన్ని తాకినట్లు చూపించారు. ఉక్రెయిన్ వైపు నుంచి విద్యార్ధులు ఆయన భుజంపైకెక్కి, భారత్‌వైపుకు వస్తున్నట్లుగా వుంది. ఇదే సమయంలో ఇతర దేశాల విద్యార్ధులు సురక్షితంగా ఆ నీటిపాయను దాటేందుకు మధ్యలో ఎవరూ లేక.. వారు హెల్ప్ , హెల్ప్ అని అరుస్తున్నట్లుగా చిత్రీకరించారు. పాకిస్తాన్, చైనా, యూఎస్ విద్యార్ధులు ఒంటరిగా నిలబడి సహాయం కోసం ఎదురుచూస్తున్నట్లుగా కనిపిస్తారు. ఆయా దేశాధినేతలైన ఇమ్రాన్ ఖాన్ (imran khan), జీ జిన్‌పింగ్, జో బైడెన్‌లు (joe biden) మాత్రం గోడల నుంచి బయటకు చూస్తున్నట్లుగా వుంది. ప్రధాని మోడీ భారతదేశపు ఆశల వారధి అంటూ పీయూష్ గోయల్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దాడి మొదలవడానికి ముందు 18000 మంది భారతీయులు ( వీరిలో ఎక్కువగా విద్యార్ధులు) ఉక్రెయిన్‌లో వున్నారు. అనంతరం ఆపరేషన్ గంగా ద్వారా వేలాది మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. రష్యా దాడి మొదలైన వెంటనే పరిస్ధితిని ఎప్పటికప్పుడు వివరిస్తూ ట్రావెల్ అడ్వైజరీలు జారీ చేస్తూ వస్తోంది భారత్. గగనతలం మూసివేసినప్పటికీ .. ఉక్రెయిన్ పశ్చిమ సరిహద్దుల మీదుగా విద్యార్ధులను స్వదేశానికి తీసుకొస్తోంది.
రాజధాని కీవ్ నుంచి రైళ్లు నడిచాయి. అలాగే రష్యా తన ఆయుధ సంపత్తిని ఖార్కివ్ చుట్టూ మోహరించడంతో పోలాండ్‌కు చేరుకోవడం తమకు కష్టంగా మారిందని బాధితులు చెబుతున్నారు. మార్చి 8 వరకు ఉక్రెయిన్ పొరుగుదేశాల నుంచి భారత్ 45 విమానాలను నడపనుంది. అయితే కీవ్, ఖార్కివ్ వంటి నగరాల నుంచి రానున్న రోజుల్లో ఉక్రెయిన్ పశ్చిమ సరిహద్దులకు చేరుకోవడం భారతీయులకు సవాల్ కానుంది. విద్యార్ధుల తరలింపుపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈ రోజు 3,726 మందిని స్వదేశానికి చేరుస్తామని పేర్కొన్నారు.
అంతకుముందు ఆపరేషన్ గంగలో (operation ganga) భాగమైన భారత వాయుసేనకు చెందిన రెండు సీ-17 విమానాలు (C-17 Flights) 420 మందితో గురువారం ఢిల్లీకి చేరాయి. రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుంచి 200 మందితో ఒక విమానం, హంగెరీ రాజదాని బుడాపెస్ట్ నుంచి 220 మందితో మరో సీ-17 విమానం ఢిల్లీలోని హిండన్ ఎయిర్ బేస్‌కి చేరుకున్నాయి. ఈ సందర్భంగా స్వదేశానికి చేరుకున్న భారతీయులకు కేంద్ర మంత్రులు అజయ్ భట్, రాజీవ్ చంద్రశేఖర్ (rajeev chandrasekhar) స్వాగతం పలికారు. కాగా, మరో 300 మందితో కూడిన మూడు సీ-17 విమానాలు గురువారం ఉదయం 8 గంటలకు ఢిల్లీకి చేరుకుంటాయని కేంద్ర విదేశాంగ శాఖ వర్గాలు చెబుతున్నాయి