
Himachal Pradesh: గతంలో జరిగిన అవినీతి ఆయుధాల ఒప్పందానికి పర్యాయపదమనీ, అయితే ప్రధాని నరేంద్ర మోదీ ఈ సంస్కృతిని మార్చారని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని తన సొంత జిల్లా బిలాస్ పూర్ లో ఇండోర్ ఆడిటోరియం భవనాన్ని ప్రారంభించిన తరువాత ఒక సభలో ప్రసంగిస్తూ నడ్డా పై వ్యాఖ్యలు చేశారు. గతంలో భారత్ ఆయుధాలను కొనుగోలు చేసేదనీ, ఇలాంటి ఒప్పందాల్లో అనేక కుంభకోణాలు ఉండేవని అన్నారు. అయితే, ఇప్పుడు ఆ దేశం ప్రపంచానికి ఆయుధాలను విక్రయిస్తోందని ఆయన అన్నారు. ప్రధాని మోడీ ఆయుధాల ఒప్పందాల్లో అవినీతికి తావులేకుండా చేశారని పేర్కొన్నారు.
బోఫోర్స్ కుంభకోణం, హెలికాప్టర్ల కుంభకోణం, జలాంతర్గామి కుంభకోణం వంటి కుంభకోణాలు ఆయుధాల ఒప్పందానికి పర్యాయపదంగా ఉన్నాయనీ, కానీ ఇప్పుడు ప్రపంచానికి ఆయుధాల ఎగుమతి ఆరు రెట్లు పెరిగిందని బీజేపీ చీఫ్ అన్నారు. అదేవిధంగా, కోవిడ్ మహమ్మారి సమయంలో దాదాపు రెండు సంవత్సరాలుగా నిర్మాణ పనులు లేనప్పటికీ బిలాస్‌పూర్ లో ఎయిమ్స్ రికార్డు స్థాయిలో ఐదేళ్లలో నిర్మించారని తెలిపారు. 2017లో 'అష్టమి' (అక్టోబర్ 3) నాడు బిలాస్‌పూర్ ఎయిమ్స్ ను ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారనీ, ఈ ఏడాది అక్టోబర్ 5న దసరా రోజున దీనిని ప్రారంభించారని చెప్పారు. అలాగే, ఎయిమ్స్ ప్రారంభ అంచనా వ్యయం రూ.1,375 కోట్లు అనీ, దీనిని రూ.1,471 కోట్లతో నిర్మించామని చెప్పారు.
కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ వరుసగా మోడీ, జై రామ్ ఠాకూర్ ప్రభుత్వాలు సాధించిన అనేక ఇతర విజయాలను హిమాచల్ ప్రదేశ్ పర్యటన సందర్భంగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. కాగా ఈ సంవత్సరం చివరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వాన్ని తిరిగి ఎన్నుకోవాలని ఓటర్లను కోరారు.
కాగా, బిలాస్‌పూర్‌లో సుమారు రూ.102 కోట్లతో చేయనున్న అభివృద్ధి పనులకు, రూ.53 కోట్లతో పూర్తి చేసిన అభివృద్ధి పనులకు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా శంకుస్థాపన చేశారు. బిలాస్‌పూర్‌లో రూ.31.52 కోట్లతో నిర్మించిన ఇండోర్ ఆడిటోరియంను ప్రారంభించి నడ్డా ప్రజలకు అంకితం చేశారు. ఇది కాకుండా ప్రాంతీయ ఆసుపత్రి బిలాస్‌పూర్‌లో రూ.14.33 కోట్లతో మాతా శిశు ఆరోగ్య కేంద్రం భవనం, రూ.3.84 కోట్లతో జిల్లా స్థాయి పంచాయతీ వనరుల కేంద్రం భవనం, రూ.1.67 కోట్లతో సీఐడీ కార్యాలయ భవనం, ఘుమర్విన్‌లో రూ.62 లక్షలతో హోంగార్డు కార్యాలయం, 63 లక్షలతో ప్రాంతీయ ఆసుపత్రి సుందరీకరణ వంటి పథకాలను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రాజకీయ సలహాదారు త్రిలోక్ జమ్వాల్, డీసీ బిలాస్పూర్ పంకజ్ రాయ్, పర్యాటక శాఖ ఎండీ అమిత్ కశ్యప్, భాషా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ పంకజ్ లలిత్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు స్వతంత్ర సాంక్యాన్, మహిళా మోర్చా అధ్యక్షురాలు భువనేశ్వరి లుంబా తదితరులు పాల్గొన్నారు. ఇదిలావుండగా, కేంద్ర ప్రభుత్వ సహకారంతో భజ్వానీ వద్ద సట్లెజ్ నదిపై రూ.3 కోట్లతో వంతెన నిర్మిస్తామని ఔహార్‌లో జరిగిన బహిరంగ సభలో ఆహార సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రాజేంద్ర గార్గ్ తెలిపారు.