
దేశంలో వ్యవసాయ రంగంలో మోడరన్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చే క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) సర్కార్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రైతులకు సహాయపడే లక్ష్యంతో ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా.. దేశంలోని పంట పొలాల్లో పురుగుమందులను పిచికారీ చేయడం కోసం Kisan dronesను ప్రధాని మోదీ శుక్రవారం ప్రారంభించారు. దేశంలోని వివిధ నగరాలు, పట్టణాల్లోని పొలాల్లో పురుగుమందులను పిచికారీ చేయడానికి 100 కిసాన్ డ్రోన్‌లను మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘డ్రోన్ అనేదానిని ఇంతకుముందు సైన్యానికి సంబంధించిన వ్యవస్థ లేదా శత్రువులను ఎదుర్కోవడానికి ఉపయోగించే వ్యవస్థ అని అనిపించేదని.. కానీ ఇప్పుడు ఇది ఆధునిక వ్యవసాయ వ్యవస్థ దిశలో కొత్త దిశ అని అన్నారు. 21వ శతాబ్దానికి చెందిన ఆధునిక వ్యవసాయ సదుపాయాల దిశలో ఇదొక కొత్త అధ్యాయం అవుతుంది. ఈ ప్రయోగం డ్రోన్ రంగం అభివృద్ధిలో ఒక మైలురాయిగా నిరూపించబడడమే కాకుండా.. అపరిమితమైన అవకాశాలను కల్పిస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను’ అని తెలిపారు.
దేశంలోని రైతులు టెక్నాలజీని అందుపుచ్చుకోవాలని, వ్యవసాయానికి టెక్నాలజీ తోడైతే అద్భుతాలు సాధించవచ్చని మోదీ అన్నారు. రైతుల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గరుడ ఎయిర్‌స్పేస్ వచ్చే రెండేళ్లలో లక్ష మేడ్ ఇన్ ఇండియా డ్రోన్‌లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రధాని తెలిపారు. దీనివల్ల యువతకు కొత్త ఉపాధి అవకాశాలు, కొత్త అవకాశాలు కూడా లభించనున్నాయి.
ఇక, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 వార్షిక బడ్జెట్‌లో వ్యవసాయం, వ్యవసాయ రంగానికి ప్రధాన ఉద్దీపనను ప్రకటించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా రైతులకు డిజిటల్, హైటెక్ సేవలను అందించడానికి.. కేంద్రం కిసాన్ డ్రోన్లు, రసాయన రహిత సహజ వ్యవసాయం, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుందని సీతారామన్ చెప్పారు. సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని నొక్కిచెప్పిన నిర్మలా సీతారామన్.. పంట అంచనా, భూ రికార్డుల డిజిటలైజేషన్, పురుగుమందులు, పోషకాలను పిచికారీ చేయడం కోసం కిసాన్ డ్రోన్‌లను ప్రోత్సహిస్తామని తెలిపారు.