నా ఐదేళ్ల టార్గెట్ ఇదే, అంతా సహకరిస్తే సాధ్యమే: నీతి ఆయోగ్ సమావేశంలో మోదీ

By Nagaraju penumalaFirst Published Jun 15, 2019, 5:58 PM IST
Highlights

కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నీతి ఆయోగ్‌ పాలకమండలి తొలిసారిగా భేటీ అయ్యింది. ఈ భేటీకి ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డితోపాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్‌ గవర్నర్లు హాజరయ్యారు. 
 

ఢిల్లీ: రాబోయే ఐదేళ్లలో 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ గల దేశంగా భారత్‌ను వృద్ధిలోకి తీసుకురావడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు ప్రధాని నరేంద్రమోదీ. 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ గల దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యం సవాలే అయినప్పటికీ సమిష్టి కృషితో ఆ లక్ష్యాన్ని చేరుకోవచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు. 

నీతి ఆయోగ్‌ పాలక మండలి ఐదో సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు దిశానిర్దేశం చేశారు. సబ్‌కా సాథ్‌, సబ్‌ కా వికాస్‌, సబ్‌కా విశ్వాస్‌ అనే నినాదాన్ని ఆచరణలో పెట్టడంలో నీతి ఆయోగ్‌ కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. 

ఎన్నికల సమరం పూర్తయ్యిందని, ఇక దేశ అభివృద్ధి కోసం అంతా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. జీడీపీ వృద్ధి కోసం జిల్లా స్థాయి నుంచే కార్యచరణ చేపట్టాలని పిలుపునిచ్చారు. పేదరికం, నిరుద్యోగం, కరువు, వరదలు, కాలుష్యం, అవినీతి, హింసపై అంతా ఏకతాటిపైకి వచ్చి పోరాడాలని మోదీ సూచించారు. 

నీటి ఎద్దడిని తగ్గించేందుకు నీటి సంరక్షణ, నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కొత్తగా ఏర్పాటు చేసిన జల్ శక్తి మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు అవసరమైన సాయం చేస్తుందని స్పష్టం చేశారు.

ఆదాయ పెంపు, ఉపాధికల్పనలో ఎగుమతు రంగానిదే కీలక పాత్ర అని ఎగుమతి రంగాన్ని ప్రోత్సహించడంపై రాష్ట్రాలు దృష్టి సారించాలని సూచించారు. పారదర్శక పాలన వల్లే చిట్టచివరి వ్యక్తికి కూడా సంక్షేమ ఫలాలు అందుతాయని మోదీ స్పష్టం  చేశారు. 

కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నీతి ఆయోగ్‌ పాలకమండలి తొలిసారిగా భేటీ అయ్యింది. ఈ భేటీకి ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డితోపాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్‌ గవర్నర్లు హాజరయ్యారు. 

రైతు సమస్యలు, కరవు, దేశ రక్షణ, మావోయిస్టు ప్రభావం,  నీటి సంరక్షణ వినియోగం, నిత్యావసర వస్తువుల చట్టంపై ప్రత్యేక దృష్టి సారించడంపై చర్చించారు. ఈ భేటీకి తెలంగాణ సీఎం కేసీఆర్, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, పంజాబ్‌ సీఎం అమరీందర్ సింగ్ లు హాజరుకాలేదు. 

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ పనుల నేపథ్యంలో కేసీఆర్ సమావేశానికి హాజరుకాలేదు. అలాగే అనారోగ్య కారణాల వల్ల పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ హాజరు కాలేదు. ఇకపోతే నిధులు కేటాయింపు అధికారంలేని నీతి ఆయోగ్‌ వల్ల ఉపయోగం లేదని మమత లేఖ సైతం రాసిన విషయం తెలిసిందే.  

click me!