
ప్రతి సంవత్సరం డిసెంబర్ 26వ తేదీన వీర్ బాడల్ దివస్ నిర్వహించాలంటూ.. ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. సిక్కుల పదో గురువు గురు గోవింద్ సింగ్ కుమారులు వీరమరణం పొందిన డిసెంబర్ 26వ తేదీన ఏటా ఇకపై వీర్‌బాల్ దివస్‌గా పాటించాలని ప్రధాని మోదీ కోరారు. గురు గోవింద్ సింగ్ జయంతి సందర్భంగా ఆదివారం ప్రధాని ఈ ప్రకటన చేశారు.
న్యాయం కోసం నిలబడి మొఘల్ పాలకుల క్రౌర్యానికి బలైన గురు గోవింద్ సింగ్ నలుగురు కుమారులకు ఇదే అసలైన నివాళి అవుతుందని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
‘సాహిబ్‌జాదా జొరావర్ సింగ్, సాహిబ్‌జాదా ఫతేహ్ సింగ్ మొఘల్ పాలకులు వారిని బంధించి గోడ కట్టడంతో వీరమరణం పొందారు. నమ్ముకున్న ధర్మానికి కట్టుబడి ప్రాణాలను సైతం వారు త్యజించారు’అని పేర్కొన్నారు.
కాగా..వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాల కారణంగా బీజేపీపై ఆగ్రహంతో ఉన్న సిక్కు వర్గాన్ని మంచి చేసుకునే చర్యల్లో భాగంగానే తాజాగా ప్రధాని మోదీ ఈ ప్రకటన చేసినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా... ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం పట్ల దమ్‌దామి తక్సల్ అధినేత హర్నామ్ సింగ్ ఖల్సా హర్షం వ్యక్తం చేశారు. 325 ఏళ్లలో సాహిబ్‌జాదాస్ అమరవీరునికి నివాళులర్పించాలని ఏ భారత ప్రభుత్వం ఆలోచించలేదన్నారు. ప్రధాని మోదీ తన బాధ్యతను నెరవేర్చారన్నారు. ఇది చాలా అభినందనీయమన్నారు.
చరిత్ర..
గురుగోవింద్ సింగ్ హిందూ మతాన్ని రక్షించడానికి తన నలుగురు పిల్లలను దేశానికి త్యాగం చేశాడు. ఆయన అలా వారిని త్యాగం చేసే సమయానికి..సాహిబ్జాదే అజిత్ సింగ్ 18 సంవత్సరాలు , జుజార్ సింగ్ కి 15 సంవత్సరాలు కావడం గమనార్హం.. డిసెంబరు 26న, సాహిబ్జాదే ఇద్దరూ మొఘల్‌లతో పోరాడుతూ చమ్‌కౌర్‌లో మత రక్షణ కోసం అమరులయ్యారు.
ప్రకాష్ పర్వ్ శుభాకాంక్షలు..
అంతకుముందు . ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ- శ్రీ గురు గోవింద్ సింగ్ జీ ప్రకాష్ పర్వ్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన జీవితం, ఆయన ఇచ్చిన సందేశాలు.. ఎందరికో స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన 350వ ప్రకాష్ ఉత్సవ్‌ను జరుపుకునే అవకాశం మన ప్రభుత్వానికి లభించడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు.