
న్యూఢిల్లీ: వైద్య రంగానికి తమ ప్రభుత్వం రూ. 2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించిందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. డాక్టర్స్ డేను పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ డాక్టర్లను ఉద్దేశించి ప్రసంగించారు. ఐఎంఏ నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు.వైద్యులను దేవుడికి మరో రూపంగా పిలుస్తామన్నారు.
కరోనా మహహ్మమారిని ఎదుర్కోవడంలో డాక్టర్లు ముందున్నారన్నారు. కరోనా సమయంలో లక్షలాది మంది ప్రజల ప్రాణాలను డాక్టర్లు కాపాడారని ఆయన గుర్తు చేశారు. కోవిడ్ సమయంలో డాక్టర్ల సేవలను ఆయన ప్రశంసించారు. కరోనా రోగులను కాపాడే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన వైద్యులకు నివాళులర్పిస్తున్నట్టుగా ఆయన చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చిన దశాబ్దాల తర్వాత వైద్య రంగంలో మౌళిక సదుపాయాలు ఎలా నిర్లక్ష్యం చేయబడ్డాయో మనందరికీ తెలుసునని చెప్పారు.
కరోనా మొదటి వేవ్ సమయంలో దేశంలో ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలను పెంచేందుకు ప్రభుత్వం రూ. 15 వేల కోట్లను ప్రత్యేక నిధిగా కేటాయించిందని ఆయన గుర్తు చేశారు.వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు వారి సేవలకు తాము ఎల్లప్పుడూ ధన్యవాదాలు చెబుతామన్నారు. వారి రక్షణ కోసం చట్టాలను తీసుకొచ్చినట్టుగా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.