3గంటలపాటు అయోధ్యలో మోడీ: షెడ్యూల్ ఇదే

By team teluguFirst Published Aug 4, 2020, 4:41 PM IST
Highlights

రేపు బుధవారం నాడు జరగనున్న ఈ వేడుకకు ప్రధాని నరేంద్రమోడీతో పాటు ప్రముఖులు హాజరు కానున్నారు.  ఈ మేరకు ప్రధాని అయోధ్య పర్యటన షెడ్యూల్ ఖరారయింది. ఆయన దాదాపుగా మూడు గంటలపాటు అయోధ్యలో గడపనున్నారు. 

శతాబ్దాలుగా వివాదాల కూపంలో చిక్కుకొని, దశాబ్దాలుగా కోర్టుల్లో నలుగుతున్న అయోధ్య వివాదానికి పరిష్కారం దొరికిన విషయం తెలిసిందే. రేపు 5వ తేదీనాడు ప్రధాని నరేంద్రమోడీ చేతులమీదుగా అయోధ్యలోని రామజన్మభూమిలో భవ్య రామాలయ మందిర నిర్మాణానికి భూమి పూజ జరగనున్న విషయం తెలిసిందే. 

రేపు బుధవారం నాడు జరగనున్న ఈ వేడుకకు ప్రధాని నరేంద్రమోడీతో పాటు ప్రముఖులు హాజరు కానున్నారు.  ఈ మేరకు ప్రధాని అయోధ్య పర్యటన షెడ్యూల్ ఖరారయింది. ఆయన దాదాపుగా మూడు గంటలపాటు అయోధ్యలో గడపనున్నారు. 

ప్రధాని రేపు బుధవారం ప్రత్యేక జెట్‌లో ఉదయం 9.30 గంటలకు ఢిల్లీ నుంచి లక్నోకు బయలుదేరతారు. లక్నో నుంచి 10.40 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో  అయోధ్యకు బయలు దేరతారు. 

11.30లకు అయోధ్య చేరుకుంటారు. 11:40 గంటలకు హనుమాన్‌గడి ఆలయంలో పూజలు చేయనున్నారు. ఈ పురాతన దేవాలయంలో ఆయన ఏడు నిమిషాల పాటు గడుపుతారు. 

మధ్యాహ్నం 12 గంటలకు రామజన్మభూమిలో మందిరం నిర్మించే ప్రదేశానికి ప్రధాని చేరుకుంటారు. మధ్యాహ్నం 12:30 నుంచి 12:40 వరకు భూమి పూజ జరుగనుంది. మధ్యాహ్నం 12:45 గంటలకు ప్రధాని మోడీ ప్రసంగం ఉంటుంది. అదే సమావేశంలో మోహన్ భగవత్, యోగి ఆదిత్యనాథ్ కూడా మాట్లాడుతారు. 

2:15 గంటలకు తిరిగి ఢిల్లీకి ప్రధాని పయనమవుతారు. భూమి పూజకు ఆహ్వానం అందినవారు మాత్రమే రేపటి కార్యక్రమానికి రావాలని ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్‌ విజ్ఞప్తి చేశారు. 

రేపటి కార్యక్రమానికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను చేసారు. ప్రోటోకాల్‌ను అనుసరించడంతో పాటు కోవిడ్ వారియర్లను సైతం అందుబాటులో ఉంచుతున్నట్లు నగర పోలీస్ కమీషనర్ తెలిపారు. వీఐపీలు వచ్చే రూట్లను డ్రోన్ల సాయంతో నిరంతరం పర్యవేక్షిస్తామని.. నగరంలోని ప్రజలకు ఎలాంటి పరిమితులు విధించలేదని, కరోనాను దృష్టిలో వుంచుకుని బయటకు రావొద్దని డీఐజీ ప్రజలను కోరారు. 

బయటి వ్యక్తులను నగరంలోకి అనుమతించమని.. ఐదుగురి కంటే ఎక్కువ మంది ఒకే చోట గుమిగూడకుండా చర్యలు చేపడుతున్నట్లు ఓ పోలీస్ అధికారి వెల్లడించారు. కరోనా టెస్టుల్లో నెగిటివ్ వచ్చిన, 45 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వారిని మాత్రమే ప్రధానికి సెక్యూరిటీగా ఉంచనున్నట్లు తెలిపారు. 

నగరంలో ట్రాఫిక్ సమస్య లేకుండా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. కాగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏర్పాటు చేసిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఈ వేడుకను నిర్వహిస్తోంది. భూమి పూజ కార్యక్రమం అనంతరం రామమందిరం నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి

click me!