పీఎం కిసాన్ నిధి: 9.5 కోట్ల మంది రైతులకు రూ. 20 వేల కోట్లు విడుదల

By narsimha lodeFirst Published May 14, 2021, 12:59 PM IST
Highlights

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకం ఎనిమిదవ విడత నిధులను  ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం నాడు రైతులకు విడుదల చేశారు. 

న్యూఢిల్లీ:ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకం ఎనిమిదవ విడత నిధులను  ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం నాడు రైతులకు విడుదల చేశారు. దేశంలోని  9.5 కోట్ల మంది రైతులకు రూ. 20 వేల కోట్ల నగదును  మోడీ ఇవాళ విడుదల చేశారు.  ఈ సందర్భంగా ఐ ఐదుగురు రైతులతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, మేఘాలయా, జమ్మూ కాశ్మీర్, అండమాన్ నికోబార్ రాష్ట్రాలకు చెందిన రైతులతో ఆయన ముచ్చటించారు.

ఏడవ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద నగదును డిసెంబర్ 25వ తేదీన విడుదల చేశారు. మాజీ ప్రధాని వాజ్‌పేయ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నిధులను విడుదల చేశారు. 2019లో ఈ పథకాన్ని మోడీ ప్రభుత్వం ప్రారంభించింది. దేశంలోని రైతులకు ఆర్ధిక సహాయం అందించేందుకు గాను ఈ పథకాన్ని మోడీ సర్కార్ ప్రారంభించింది. ఒక్కో రైతుకు ఏటా రూ. 6 వేలను అందించనున్నారు. మూడు విడతలుగా ఈ నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ప్రతి విడతలో రూ. 2 వేలు జమ చేస్తారు. 

తొలి విడత నిధులను ఏప్రిల్ నుండి జూలై , రెండో విడత నిధులు ఆగష్టునుండి నవంబర్ మధ్యలో, మూడో విడత నిధులను డిసెంబర్ నుండి మార్చి మధ్యలో చెల్లించనున్నారు. 2019 ఫిబ్రవరిలో ఈ పథకం ప్రారంభించిన సమయంలో  చిన్న, మధ్యతరహా రైతులకు మాత్రమే వర్తింపజేశారు. అయితే అదే ఏడాది జూన్ మాసంలో అందరు రైతులకు ఈ పథకాన్ని వర్తింపజేసేలా కేంద్రం నిర్ణయం తీసుకొంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఏటా రూ. 6 వేలను దేశంలోని 14.5 కోట్ల మంది రైతులకు అందించనున్నారు. 


 

click me!