
కొచ్చి: ప్రకృతి ప్రకోపంతో విలవిలలాడుతున్నకేరళను అన్ని విధాలు ఆదుకుంటామని ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. కేరళలో వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ తోకలసి సమీక్ష సమావేశం నిర్వహించారు. సహాయక చర్యలు, పునరావాస కేంద్రాల నిర్వహణ, ప్రజలకు నిత్యావసర సరుకుల పంపిణీ, డ్యామ్ లపరిస్థితిపై ఆరా తీశారు. శుక్రవారం సాయంత్రం కేరళ చేరుకున్న ప్రధాని నరేంద్రమోదీ ఏరియల్ సర్వే ద్వారా వరద ప్రరిస్థితిని సమీక్షించారు.
వరదల బీభత్సంతో రాష్ట్రంలో 20వేల కోట్ల రూపాయలు నష్టం జరిగిందని తక్షణమే 2వేల కోట్లు సాయం కింద విడుదల చేయాలని కేరళ ప్రభుత్వం ప్రధాని మోదీని విజ్ఞప్తి చేసింది. వరదలతో అతలాకుతలమవుతున్న కేరళకు తక్షణ సాయంగా మోదీ 500 కోట్ల రూపాయలు ప్రకటించారు. అలాగే ఈనెల 12న కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ 100 కోట్ల రూపాయలు సాయాన్ని ప్రకటించారు.
శనివారం ఉదయం వాతావరణం అనుకూలించకపోవడంతో ఏరియల్ సర్వేను రద్దు చేసుకున్నప్రధాని ఆ తర్వాత వాతావరణం అనుకూలించడంతో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఏరియల్ ఏరియల్ సర్వే ద్వారా వరద పరిస్థితిని సమీక్షించారు. ఏరియల్ సర్వేలో ప్రధాని నరేంద్రమోదీతోపాటు, కేంద్రమంత్రి అల్పోన్స్, కేరళ గవర్నర్ సదాశివం, సీఎం పినరయి విజయన్ పాల్గొన్నారు.
మరోవైపు వరదల్లో మృతి చెందిన వారికి కేంద్ర ప్రభుత్వం తరపున 2లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడిన వారికి 50వేల రూపాయల నష్టపరిహారాన్ని ప్రకటించారు.
అటు కేరళలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 42 నావీ,16 ఆర్మీ, 28 కోస్ట్ గార్డ్, మరియు39 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. వీటికి అదనంగా మరో 14 ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొననున్నట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది.