నన్ను వదిలేయండి బాబోయ్.. నేను మాజీ సీఎంను కాదు.. గోల్ కీపర్ విజ్ఞప్తి.. స్పందించిన మాజీ సీఎం

By telugu teamFirst Published Sep 30, 2021, 3:16 PM IST
Highlights

పంజాబ్‌‌ రాజకీయ సంచలనాలకు తన రాజీనామాతో తెరతీసిన మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ పేరు రోజూ హెడ్‌లైన్స్‌లో నిలుస్తున్నాయి. ట్విట్టర్‌లోనూ అనేక విషయాలు, అప్‌డేట్లు ఆయన పేరును ట్యాగ్ చేస్తూ నెటిజన్లు, జర్నలిస్టులు పోస్టు చేస్తున్నారు. కొందరు పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఖాతాకు బదులు భారత ఫుట్ బాల్ టీమ్ గోల్‌కీపర్ అమరీందర్ సింగ్ పేరును ట్యాగ్ చేస్తున్నారు. తన పేరును ట్యాగ్ చేయడం నిలిపేయాలని ట్విట్టర్‌లో తాజాగా గోల్ కీపర్ అమరీందర్ సింగ్ విజ్ఞప్తి చేశారు.

చండీగడ్: పంజాబ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. రోజురోజుకు కొత్త ట్విస్టులతో రసకందాయంగా సాగుతున్నది. కాంగ్రెస్‌కు షాక్‌ల మీద షాక్‌లు వస్తున్నాయి. ఈ సంచలనాలకు కేంద్ర బిందువుగా కెప్టెన్ అమరీందర్ సింగ్ ఉన్నారు. ఆయన సీఎం పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి వార్తల్లో నిలుస్తున్నారు. కానీ, ఈ రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని మరో అమరీందర్ సింగ్‌ను తరుచూ డిబేట్‌లోకి లాగుతున్నారు. పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ అనుకుని తరుచూ ఇండియా ఫుట్‌బాల్ టీమ్ గోల్ కీపర్ అమరీందర్ సింగ్‌ను ట్విట్టర్‌లో ట్యాగ్ చేస్తున్నారు.

ఈ వ్యవహారంతో చిర్రెత్తుకొచ్చిన గోల్ కీపర్ నన్ను వదిలేయండి బాబోయ్ అనేంతలా ఓ ట్వీట్ చేశారు. వార్తా సంస్థలు, జర్నలిస్టులకు విజ్ఞప్తి చేస్తూ తాను ఇండియా ఫుట్ బాల్ టీమ్ గోల్ కీపర్ అమరీందర్ అని స్పష్టం చేశారు. అంతేగానీ, పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కాదని అన్నారు. దయచేసి తనను ట్యాగ్ చేయవద్దని చేతులు జోడించి వేడుకున్నారు. ఈ ట్వీట్‌పై జోక్‌లు పేలుతున్నాయి. మీమ్‌లు కుప్పలుతెప్పులుగా వచ్చాయి.

ఈ ట్వీట్‌పై పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా స్పందించారు. ‘నా యువ మిత్రుడా నీకు నా సానుభూతి తెలుపుతున్నా. భవిష్యత్‌లో నువు ఆడే గేమ్‌ల కోసం గుడ్ లక్’ అంటూ ట్వీట్ చేశారు.

 

I empathise with you, my young friend. Good luck for your games ahead. https://t.co/MRy4aodJMx

— Capt.Amarinder Singh (@capt_amarinder)

ఇద్దరి పేర్లు అమరీందర్ సింగ్ కావడంతో ట్విట్టర్ ఖాతాదారులు, మీడియా ప్రతినిధులు, పాత్రికేయులు కన్ఫ్యూజ్ అయ్యారు. అందుకే తరుచూ అప్‌డేట్లు, వివరాలను పంచుకోవడానికి ఈ ఇద్దరిలో ఎవరిదో ఒకరి పేరును ట్యాగ్ చేస్తున్నారు.

అసలే డిసప్పాయింట్‌లో ఉన్న గోల్ కీపర్ అమరీందర్ సింగ్‌కు ఈ బెడద చికాకు తెప్పించింది. ఏటీకే మోహన్ బగన్ టీమ్ గోల్ కీపర్‌గానున్న ఆయనకు బుధవారం కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఎస్ఏఎఫ్ఎఫ్ 2021ఛాంపియన్షిప్ ఇండియా స్క్వాడ్ నుంచి తప్పించారు. ఇది అక్టోబర్ 1 నుంచి మొదలు కానుంది. ఈ ఈవెంట్ వెళ్లనున్న 23సభ్యుల మ్యాన్ స్క్వాడ్‌లో అమరీందర్ సింగ్‌కు బదులు ధీరజ్ సింగ్‌ను చేర్చుకున్నారు.

click me!