
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇటీవలి బడ్జెట్‌లో ఆరోగ్య సంరక్షణపై 5 శాతం పన్నును ప్రతిపాదించిందనే ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డాక్టర్ దేవి శెట్టి పేరుతో ఉన్న లేఖను పలువురు విస్తృతంగా షేర్ చేస్తున్నారు. అయితే అందులో ఎలాంటి నిజం లేదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్.. ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. అసలేం జరిగిందంటే.. ఇటీవలి బడ్జెట్‌లో ఆరోగ్య సంరక్షణపై ప్రతిపాదిత 5 శాతం పన్ను ప్రతిపాదించిందని.. దానిని వ్యతిరేకిస్తూ డాక్టర్ దేవి శెట్టి బహిరంగ లేఖ రాశారని కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ జవహర్ సిర్కార్ కూడా దేవి శెట్టి పేరుతో ఉన్న లేఖను షేర్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆ పన్నును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ కూడా చేశారు. ‘‘ఆరోగ్య సేవలపై మోదీ-నిర్మల సేవా పన్ను మధ్యతరగతి, పేదలను నాశనం చేస్తుందన్న డాక్టర్ దేవి శెట్టితో పూర్తిగా ఏకీభవించండి. ఈ పన్నును ఉపసంహరించుకోండి!’’ అని జవహర్ సిర్కార్ ట్వీట్ చేశారు.
అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పందించింది. ఆరోగ్య సంరక్షణపై కేంద్ర ప్రభుత్వం పన్నును ప్రతిపాదించిందని పేర్కొన్న ట్వీట్ పూర్తిగా అవాస్తమని తెలిపింది. ఆ ట్వీట్‌తో జతచేయబడిన లేఖ 2011 సంవత్సరానికి చెందినదని తెలిసిందే. అయితే సందర్భం లేకుండా ఆ లేఖ ఇప్పుడు షేర్ చేయబడుతుందని పేర్కొంది.
ఇదిలా ఉంటే, ఆ లేఖ డాక్టర్ దేవి శెట్టి రాశారని.. అయితే 2011లో అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ 25 లేదా అంతకంటే ఎక్కువ పడకలతో సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సౌకర్యాలు కలిగిన ఆసుపత్రులు అందించే ఆరోగ్య సంరక్షణ సేవలపై 5 శాతం సేవా పన్ను విధించాలని ప్రతిపాదించిన సమయంలో ఈ పరిణామం చోటుచేసుకుందని పలువురు పేర్కొంటున్నారు.