
Ganesh-Lakshmi Photos On Currency Notes: కరెన్సీ నోట్లపై హిందూ దేవతలన వినాయకుడు, లక్ష్మిదేవీ ఫోటోల విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ (ఆప్) నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ వెనక్కితగ్గేలా కనిపించడం లేదు. ఇప్పటికే కరెన్సీ నోట్లపై హిందూ దేవతల ఫొటోలను ముద్రించాలని పేర్కొన్నారు. ఇదే విషయంపై తాజాగా ఆయన ప్రధాని నరేంద్ర మోడీ లేఖ సైతం రాశారు. మరోసారి కరెన్సీ నోట్లపై హిందు దేవతలైన వినాయకుడు, లక్ష్మిదేవతల ఫొటోలను ముద్రించాలని నొక్కి చెప్పారు.
కేంద్రంలోని బీజేపీ సర్కారును, ప్రధాని నరేంద్ర మోడీని ఇరకాటంలో పెట్టేవిధంగా కరెన్సీ నోట్లపై గణేష్-లక్ష్మి ఫోటోల కోసం కేజ్రీవాల్ లేఖ రాశారు. ఇదివరకు విలేఖరుల సమావేశంలో ఇదే విషయాన్ని విజ్ఞప్తి చేసిన తర్వాత, కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీతో పాటు గణేష్-లక్ష్మి ఫోటోలను ముద్రించాలని కోరుతూ ఆయన ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఇది 130 కోట్ల మంది భారత పౌరుల డిమాండ్ అని, తన విజ్ఞప్తిపై ప్రజల్లో ఎనలేని ఉత్సాహం ఉందని పేర్కొన్నారు. ఇదే సమయంలో ప్రభుత్వంపైన కూడా ఆయన విమర్శలు గుప్పించారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా, భారతీయులలో అధిక జనాభా పేదలుగా మిగిలిపోయిందనీ, సమస్యను తగ్గించేందుకు కృషి చేయాల్సి ఉండగా, భగవంతుని ఆశీస్సులు కూడా అవసరమని ఆయన అన్నారు.
దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు కరెన్సీ నోట్లపై వినాయకుడు, లక్ష్మీదేవి చిత్రాలను ముద్రించాలన్న తన సూచనను పరిగణనలోకి తీసుకోవాలని అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. "ఈ రోజు నేను కేంద్ర ప్రభుత్వానికి మరియు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేస్తున్నాను. భారత కరెన్సీపై గాంధీజీ ఫోటో ఉంది, అది అలాగే ఉండనివ్వండి, కరెన్సీకి మరోవైపు, హిందూ దేవతలైన వినాయకుడు, లక్ష్మి దేవీల ఫోటోలను ముద్రించాలి" అని కేజ్రీవాల్ అన్నారు. ‘‘నేను చెప్పినట్లు మన దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే చాలా కష్టపడాలి.. కానీ దానితో కూడా దేవుళ్ల ఆశీస్సులు కావాలి.. కరెన్సీ నోట్లపై ఫొటో ఉంటే దేశం మొత్తం ఆశీస్సులు లభిస్తాయి. ఒకవైపు గణేష్ జీ, లక్ష్మి జీ-మరోవైపు గాంధీజీ ఉంటారు" అని అన్నారు.
దీపావళి నాడు శాంతి, శ్రేయస్సు కోసం పూజలు చేస్తున్నప్పుడు ఈ ఆలోచన వచ్చిందని కేజ్రీవాల్ తెలిపారు. అయితే, ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగుతుండటం కేజ్రీవాల్ హిందు అంశాలను తెరమీదకు తీసుకురావడంపై రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా ప్రధాని స్వరాష్ట్రం గుజరాత్ లో ఎన్నికలు త్వరలోనే జరగున్నాయి. పక్కా ప్రణాళికతో ఆప్ ముందుకు సాగుతోంది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ లకు దీటుగా ప్రచారం కొనసాగిస్తూ... ప్రజల్లోకి వెళ్తోంది. అయితే, ఆప్ లేవనెత్తున్న ఈ కరెన్సీ నోట్లపై హిందూ దేవుళ్ల ఫొట్లోలు ముద్రించడం.. ఓటర్లను ప్రలోభపెట్టడానికి 'సాఫ్ట్ హిందుత్వ' వ్యూహంగా ఉందని ఇతర పార్టీలు ఆరోపిస్తున్నాయి. కేజ్రీవాల్ ప్రకటన చేసిన కొద్దిసేపటికే కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు ఆయనపై విమర్శల దాడికి దిగాయి.