జోషిమఠ్ సంక్షోభం: జాతీయ విపత్తుగా ప్రకటించాలని సుప్రీంకోర్టులో పిటిష‌న్.. రేపు విచార‌ణ

By Mahesh RajamoniFirst Published Jan 15, 2023, 3:54 PM IST
Highlights

Joshimath: జోషిమఠ్ సంక్షోభం మ‌రింత‌గా ముదురుతోంది. దీనిని జాతీయ విపత్తు ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు సోమవారం విచార‌ణ జ‌ర‌ప‌నుంది. అయితే, ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సంస్థలు ఉన్నాయనీ, అన్ని ముఖ్యమైన విషయాలు తమ వద్దకు రావొద్దని పేర్కొంటూ జనవరి 10న ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది.
 

Joshimath-Supreme Court: ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్ సంక్షోభాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించేందుకు కోర్టు జోక్యం చేసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సోమవారం నాడు సుప్రీంకోర్టు విచారించనుంది. సుప్రీం కోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన జనవరి 16 నాటి కాజ్ లిస్ట్ ప్రకారం, స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి దాఖలు చేసిన పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ పిఎస్ నర్సింహ, జేబీ పార్దివాలాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించనుందని వార్తా సంస్థ పీటీఐ నివేదించింది. అయితే, ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సంస్థలు ఉన్నాయనీ, అన్ని ముఖ్యమైన విషయాలు తమ వద్దకు రావొద్దని పేర్కొంటూ జనవరి 10న ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది.

"ముఖ్యమైనవన్నీ మా వద్దకు రానవసరం లేదు. దానిని పరిశీలించడానికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సంస్థలు ఉన్నాయి. మేము దానిని జనవరి 16న జాబితా చేస్తాము" అని పిటిషనర్ తరఫు న్యాయవాది పిటిషన్‌ను ప్రస్తావించి, దాని అత్యవసర జాబితాను కోరిన క్ర‌మంలో సీజేఐ పేర్కొన్నారు. ఈ క్ర‌మంలోనే జనవరి 16న విచారణకు అవిముక్తేశ్వరానంద సరస్వతి పిటిషన్‌ను లిస్ట్ చేసింది. త‌న పిటిష‌న్ లో పెద్ద ఎత్తున పారిశ్రామికీకరణ కారణంగా ఈ సంఘటన జరిగిందనీ, రాష్ట్ర ప్రజలకు తక్షణ ఆర్థిక సహాయం, పరిహారం ఇవ్వాలని పిటిషనర్ వాదించారు. ఈ సంక్షోభ స‌మ‌యంలో జోషిమఠ్ నివాసితులకు చురుగ్గా మద్దతు ఇవ్వడానికి జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీకి దిశానిర్దేశం చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. "మానవ జీవితాన్ని-వారి పర్యావరణ వ్యవస్థను పణంగా పెట్టి ఎటువంటి అభివృద్ధి అవసరం లేదు.. అలాంటిది ఏదైనా జరగాలంటే, దానిని యుద్ధ స్థాయిలో వెంటనే ఆపడం రాష్ట్ర-కేంద్ర ప్రభుత్వాల‌ కర్తవ్యం" అని విజ్ఞప్తి చేశారు.

ఉత్త‌రాఖండ్ లోని జోషిమఠ్, మతపరమైన-పర్యాటక ప్రాముఖ్యత కలిగిన బద్రీనాథ్, హేమకుండ్ సాహిబ్, అంతర్జాతీయ స్కీయింగ్ గమ్యస్థానం ఔలి వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు ప్రవేశ ద్వారం. అయితే, ప్ర‌స్తుతం ఈ ప్రాంతంలో పెద్దఎత్తున ప‌గుళ్లు ఏర్ప‌డుతున్నాయి. ఇళ్లు, రోడ్లు, పొలాల్లో భారీ పగుళ్లతో పట్టణం క్రమంగా భూమిలోకి క్రుంగిపోతోంది. చాలా ఇళ్లు వంగి మునిగిపోతున్నాయని స్థానికులు భ‌యాందోళ‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు.

ఇప్ప‌టికే జోషిమ‌ఠ్ ప‌గుళ్ల‌పై కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల ప్ర‌త్యేక బృందాలు ప‌రిశోధ‌న‌లు చేస్తున్నాయి. ఇటీవ‌ల జోషిమ‌ఠ్ భూమిలోకి కుంగిపోవ‌డం క్ర‌మంగా పెరుగుతున్న‌ద‌ని భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ‌కు చెందిన రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ నివేదిక‌లు హెచ్చరించిన క్ర‌మంలో ప్ర‌భుత్వ యంత్రాంగం మ‌రింత అప్ర‌మ‌త్త‌మైంది. జోషిమ‌ఠ్ నుంచి ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లిస్తోంది. ఇప్ప‌టికే 100 వ‌ర‌కు కుటుంబాల‌ను వేరే ప్రాంతాల‌కు త‌ర‌లించిన‌ట్టు సంబంధిత ప్ర‌భుత్వ వ‌ర్గాలు తెలిపాయి. జోషిమఠ్ నివాసితుల‌ను ప్ర‌భుత్వం అన్ని విధాలుగా ఆదుకుటుంద‌ని ఉత్త‌రాఖండ్ ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. 

ఇప్పటి వరకు 185 కుటుంబాలను సహాయక కేంద్రాలకు తరలించామని, బాధిత ప్రజల తరలింపు కొనసాగుతోందని చమోలి జిల్లా విపత్తు నిర్వహణ అధికారి తెలిపారు. పగుళ్లు ఏర్పడిన ఇళ్ల సంఖ్య 760 ఉండగా, అందులో 147 అసురక్షితంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సంఖ్య పెరుగుతున్న‌ద‌ని కూడా వెల్ల‌డించారు.

click me!