పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. నేడు లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రసంగం..

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఈరోజు ప్రారంభం కానున్నాయి. ఐదు రోజుల పాటు జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి.

Google News Follow Us

న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఈరోజు ప్రారంభం కానున్నాయి. ఐదు రోజుల పాటు జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ సమావేశాల మొదటి రోజు లోక్‌సభలో ‘‘సంవిధాన్ సభ నుంచి ప్రారంభమైన 75 సంవత్సరాల పార్లమెంటరీ ప్రయాణం- విజయాలు, అనుభవాలు, జ్ఞాపకాలు, అభ్యాసాలు’’పై చర్చను నిర్వహించనున్నారు. ఈ మేరకు లోక్‌సభ బిజినెస్ కూడా జాబితా చేయబడింది. అయితే ఈ చర్చలో భాగంగా ప్రధాని మోదీ ఈరోజు ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభమైన తర్వాత.. లోక్‌సభలో ప్రసంగించనున్నారు. 

ఇదే అంశంపై రాజ్యసభలో జరిగే చర్చలో బీజేపీ సీనియర్ నేత పీయూష్ గోయల్ ప్రారంభించనున్నారు. అయితే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు పాత భవనంలోనే ప్రారంభం అవుతుండగా.. సెప్టెంబర్ 19న గణేష్ చతుర్థి సందర్భంగా పాత పార్లమెంట్ భవనం నుంచి కొత్త భవనానికి అధికారికంగా మారనుండటం ప్రాధాన్యత సంతరించుకోనుంది. 

మంగళవారం ఉదయం 11 గంటలకు సెంట్రల్ హాల్‌లో లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు ఉమ్మడి సమావేశం.. ‘‘భారత పార్లమెంట్ గొప్ప వారసత్వాన్ని స్మరించుకోవడం, 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే సంకల్పం’’ కార్యక్రమం కోసం నిర్వహించబడుతుంది. ఆ తర్వాత ఫోటో సెషన్ ఉంటుంది. సెంట్రల్ హాల్‌లోఈ కార్యక్రమం అనంతరం సభను కొత్త పార్లమెంట్ భవనానికి మార్చనున్నారు. గణేష్ చతుర్థి అయినందున చిన్న పూజ నిర్వహించనున్నారు.

ఇక, ఆదివారం ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌కర్‌ పార్లమెంట్ నూతన భవనం వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో లోక్‌సహా స్పీకర్‌ ఓం బిర్లా కూడా పాల్గొన్నారు.

ప్రధాన ఎన్నికల కమీషనర్, ఇతర ఎన్నికల కమీషనర్‌లు (అపాయింట్‌మెంట్, సర్వీస్ షరతులు, పదవీకాలం) బిల్లు, పోస్టాఫీసు బిల్లు, న్యాయవాదుల (సవరణ) బిల్లు,  పీరియాడికల్స్ ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ బిల్లు వంటివి పార్లమెంట్ కార్యకలాపాలలో భాగంగా ఉన్నాయి.