
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచం ఎంత అభివృద్ధి చెందుతోంది. గుహాల్లో నివసించిన మానవుడు గ్రహాంతరాలపై కాలుమోపుతున్నాడు. కాలినడకన వెళ్లిన వ్యక్తి నేడు రాకెట్లో ప్రయాణిస్తున్నాడు. అయినా.. కొన్ని చోట్ల మూఢనమ్మకాలు, వింత ఆచారాలు రాజ్యమేలుతున్నాయి. కొంతమంది చేతబడులు, మంత్రాల అనే పైశాచికతత్వాన్ని ఇతరులపై రుద్దుతున్నారు. అలాంటి మూఢనమ్మకాలను నిర్మూలించడానికి ప్రభుత్వాలు, స్వచ్చంధ సంస్థలు ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా.. కొందరూ మాత్రం మూఢనమ్మకాలను గుడ్డిగా ఆచరిస్తున్నారు. తాజాగా కర్ణాటకలో జరిగిన అమానుష ఘటన ఇందుకు నిదర్శనం.
ప్రమాదశాత్తు చనిపోయిన ఓ బాలుడు తిరిగి బతుకుతాడని తల్లిదండ్రులు చేసిన వింత చేష్టాలు అందరిని విస్తుగొలిపాయి. ఆ తల్లిదండ్రులు తన కొడుకు మృతదేహాన్ని ఉప్పుతో కప్పి దాదాపు 8 గంటల పాటు అలాగే ఉంచాడు. ఈ ఘటన బళ్లారి జిల్లా సిరివరలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలో బళ్లారి తాలూకాలోని సిరివార గ్రామానికి చెందిన శేఖర్, గంగమ్మ దంపతుల చిన్న కుమారుడు భాస్కర్(10). ఆ బాలుడు సోమవారం నాడు తన స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లాడు.
అయితే.. ప్రమాదవశాత్తూ మునిగిపోయాడు. నీటి గుంతలో పడి మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లితండ్రులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని తమ కుమారుడి మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు.
అయితే నీటిలో పడి మరణించిన వారిని రెండు గంటల్లోగా ఉప్పులో కప్పి పెడితే బతుకుతారనే మూఢ నమ్మకంతో వారు తమ కొడుకు మృతదేహాన్ని ఉప్పుతో కప్పిపెట్టారు. ఇందుకోసం దాదాపు వంద కేజీలను ఉపయోగించారు. తమ కొడుకు ఎలాగైనా కళ్లు తెరుస్తాడని, బతికి వస్తాడని సుమారు 8 గంటల పాటు ఎదురు చూశారు. ఈ వింత చేష్టాల గురించి తెలుసుకున్న గ్రామ అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధిత తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ తరువాత బాలుడు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సంఘటన తాజాగా స్థానికంగా సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈ ఉదంతం సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.