
తనను మతం మార్చుకోవాలంటూ బలవంతపెట్టారంటూ.. ఇటీవల పాక్ చెర నుంచి బయటపడ్డ యువకుడు తెలిపాడు. పొరపాటున పాకిస్తాన్ బోర్డర్ దాటి.. అక్కడ భద్రతా సిబ్బందికి చిక్కి.. చానాళ్లపాటు అక్కడి జైల్లో మగ్గిన యువకుడు ప్రశాంత్.. ఎట్టకేలకు భారత్ లో అడుగుపెట్టాడు. కాగా.. పాక్ జైల్లో తాను ఎదుర్కొన్న అనుభవాలను యువకుడు మీడియాతో పంచుకున్నాడు.
పాక్ బోర్డర్ దాటిన తర్వాత తనను అదుపులోకి తీసుకున్నారని ప్రశాంత్ పేర్కొన్నాడు. తాను మళ్లీ తన పేరెంట్స్ ని కలుస్తానని అనుకోలేదని.. భారత ప్రభుత్వ సహాయంతోనే తాను మళ్లీ స్వదేశంలో అడుగుపెట్టగలిగానని అతను చెప్పాడు. తనలాగే పాక్ లో ఇరుక్కున్న వాళ్లు చాలా మంది ఉన్నారని అతను చెప్పాడు.
‘‘అక్కడ చిక్కుక్కున్న భారతీయుల పేర్లను నేను ప్రభుత్వానికి ఇచ్చాను. కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్‌లో నాలాగా చిక్కుక్కున్న మిగతా వారిని కూడా భారత్‌కి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలి అని కోరుకుంటున్నా. కొంతమంది శిక్ష పూర్తయినా ఇంకా ఎంబసీలోనే క్లియరెన్సీ కోసం వేచి చూస్తున్నారు. ఇండియా, పాకిస్తాన్ బోర్డర్‌లో నన్ను ఎవరూ పట్టుకోలేదు. పాకిస్తాన్ బోర్డర్ దాటి నడుచుకుంటూ వెళ్తుంటే హైవే ప్యాట్రోల్ వాహనం వాళ్ళు రెండోవ రోజు నన్ను పట్టుకున్నారు. పాకిస్థాన్‌లోకి ప్రవేశించిన తరవాత నేను ఎడారిలో 40 కిలో మీటర్లు నడిచాను. పాకిస్థాన్ భద్రత సిబ్బంది మానవత్వం చూపారు. పాకిస్థాన్ జైల్లో ఏ భారత ఖైదీలతో పని చేయించరు. పాకిస్థాన్‌లో ఉన్న ఖైదీలను ముస్లింలుగా మారమని అడుగుతారు. నేను మారనని శివుణ్ణి ప్రార్థిస్తానని చెప్పాను. దేశం కోసం, పాకిస్థాన్ కోసం ప్రార్థనలు చేశాను. నేను భావల్‌పూర్ సెంట్రల్ జైల్లో ఉన్నాను. నాతో పాటు జైల్ సెల్‌లో ఇంకొకరు ఉండే వారు. మళ్లీ నేను ఓ మంచి సాప్ట్‌వేర్ ఇంజినీర్‌గా స్థిరపడతా. దానికోసం జైల్లోనే కొన్ని పుస్తకాలు చదివాను’’ అని ప్రశాంత్ వెల్లడించాడు.