నలుగురు ఉగ్రవాదులు పాకిస్తాన్ వైపు నుంచి అంతర్జాతీయ సరిహద్దు దాటి జమ్ములోకి చొరబాటుకు ప్రయత్నించారు. వారి ప్రయత్నాలను భారత సైన్యం అడ్డుకునేందుకు యత్నించగా.. భారత సైన్యం దృష్టి మరల్చడానికి పాకిస్తాన్ ఆర్మీ దాని సొంత ఆర్మీ పోస్టునే తగులబెట్టుకుంది.
Pakistan Army: పాకిస్తాన్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఉగ్రవాదులను భారత్‌లోకి పంపిస్తున్నది. ఎల్‌వోసీ, అంతర్జాతీయ సరిహద్దు గుండా టెర్రరిస్టులు భారత భూభాగంలోకి చొరబడటానికి పాకిస్తాన్ ఆర్మీ సహాయపడుతున్నది. ఈ ఆరోపణలను ధ్రువీకరించే మరో ఘటన చోటుచేసుకుంది. పాకిస్తాన్ నుంచి జమ్ములోకి చొరబడుతున్న ఉగ్రవాదులను కాపాడుకోవడానికి పాకిస్తాన్ ఆర్మీ ఏకంగా సొంత ఆర్మీ పోస్టునే తగులబెట్టుకుంది. తద్వార భారత సైనికుల0ను, నిఘా వ్యవస్థను దృష్టి మళ్లించాలని అనుకుంది. కొన్ని విశ్వసనీయ వర్గాలు జాతీయ మీడియాకు ఈ మేరకు తెలిపినట్టు కథనాలు వచ్చాయి.
నలుగురు ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొరబాటుకు ప్రయత్నించారు. కానీ, భారత సైన్యం వీరి కదలికలను గుర్తించింది. భారత సైన్యం వారి ప్రయత్నాలను తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. మరో ఇద్దరు మాత్రం తప్పించుకుని తిరిగి పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లిపోయారు.
ఇండియన్ ఆర్మీ 16 కార్ప్స్ ఎక్స్‌లో ఓ ట్వీట్ చేసింది. ఖౌర్, అఖ్‌నూర్‌లలో ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలను భారత సైన్యం తిప్పికొట్టిందని పేర్కొంది. 22, 23వ తేదీల నడుమ రాత్రిలో నలుగురు ఉగ్రవాదుల కదలికలను సర్వెలెన్స్ డివైజ్‌ల ద్వారా కనిపెట్టామని, అయితే, వారిపై జరిపిన ఎదురుకాల్పుల్లో వారి ప్రయత్నాలను అడ్డుకట్ట వేసిందని వివరించింది. ఉగ్రవాదులు ఒక టెర్రరిస్టు మృతదేహాన్ని వెనక్కి లాక్కుంటూ తీసుకెళ్లుతున్నప్పుడు కనిపించారని తెలిపింది.
Also Read : Prashant Kishor: ఏపీలో ఎన్నికల రాజకీయం.. టీడీపీ, వైసీపీలను గురు శిష్యులు పంచుకున్నారా?
అయితే, వీరి చొరబాటు ప్రయత్నాల నుంచి దృష్టి మరల్చడానికి పాకిస్తాన్ ఆర్మీ వారికి చెందిన ఓ పోస్టును తగులబెట్టింది. దీనితోపాటు మరో ముఖ్యమైన విషయం ఇక్కడ గమనించాల్సి ఉన్నదని, ఉగ్రవాదులు కేవలం ఎల్‌వోసీ గుండానే కాదు.. అంతర్జాతీయ సరిహద్దు గుండా ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నిస్తున్నారని కొన్ని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.