పాక్ వక్రబుద్ధి: కోవింద్ గగనతల యానానికి అనుమతి నిరాకరణ

By telugu teamFirst Published Sep 8, 2019, 9:08 AM IST
Highlights

కాశ్మీరుకు సంబంధించి ఆర్టికల్ 370ని రద్దు చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ తన వక్రబుద్ధిని చాటుకుంది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గగనతల యానానికి అనుమతి నిరాకరించింది. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దానికి ఆమోదం తెలిపారు.

న్యూఢిల్లీ: కాశ్మీరుకు సంబంధించి భారత్ ఆర్టికల్ 370ని రద్దు చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ విదేశీ పర్యటనకు తన గగనతలాన్ని వాడుకునేందుకు పాకిస్తాన్ నిరాకరించింది. మూడు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి సోమవారం ఐస్ ల్యాండ్ వెళ్తున్నారు. 

ఈ నేపథ్యంలో రామ్ నాథ్ కోవింద్ ప్రయాణించే విమానం గగనతలం మీదుగా ఐస్ ల్యాండ్ వెళ్లేందుకు అనుమతించాలని భారత్ పాకిస్తాన్ ను కోరింది. అయితే, తాము అనుమతి నిరాకరిస్తున్నట్లు పాకిస్తాన్ శనివారంనాడు తెలియజేసింది.

భారత్ చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చినట్లు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ తెలిపారు. కాశ్మీరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా తమ గగనతలాన్ని ఉపయోగించుకునేందుకు భారత్ కు అవకాశం ఇవ్వకూడదనే నిర్ణయానికి తమ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆమోదం తెలిపినట్లు ఆయన చెప్పారు. 

కోవింద్ ఐస్ ల్యాండ్, స్విట్జర్లాండ్, స్లోవేనియాల్లో మూడు రోజులు పర్యటించనున్నారు. తన పర్యటనలో ఆయన ఆయా దేశాల ముఖ్య నాయకులతో భేటీ అవుతారు. పుల్వామా దాడితో సహా ఈ ఏడాది ఉగ్రవాద ఘటనలు పెరిగిన నేపథ్యంలో భారత దేశ ఆందోళనలను కోవింద్ ఆ దేశాల నాయకులకు వివరించే అవకాశం ఉంది.

click me!