
తానొక ఇండియన్ అని.. లండన్ లో డాక్టర్ గా చేస్తున్నానని చెప్పి.. ఓ పాక్ యువకుడు ముంబయి యువతికి పెళ్లి ప్రపోజల్ తీసుకువచ్చాడు. అతని ప్రపోజల్ కి ఆల్ మోస్ట్ చెప్పిన ఆ అమ్మాయికి ఎందుకో కొద్దిగా అనుమానం కలిగింది. ఆరా తీస్తే షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.
పూర్తి వివరాల్లోకి వెళితే.. ముంబయికి చెందిన ఓ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి ఓ మ్యాట్రీమోనీ వెబ్ సైట్ లో తన ఫోటో, డీటైల్స్ పొందుపరిచింది. కాగా.. చాలా మంది అబ్బాయిల నుంచి ఆమెకు రిక్వెస్టులు రావడం మొదలయ్యాయి. వాటిల్లో ఒకరి పొఫ్రెల్ ఆమెను ఆకట్టుకుంది.
అందులో ఆ అబ్బాయి.. తాను నాగ్ పూర్ కి చెందిన వాడుగా.. ప్రస్తుతం లండన్ లో డాక్టర్ గా చేస్తున్నట్లు పేర్కొన్నాడు. అతని డీటైల్స్ నచ్చడంతో అతనితో యువతి మాట్లాడటం మొదలుపెట్టింది.
ఒకరోజు లండన్ లో అతను పనిచేస్తున్న హాస్పటల్స్ వివరాలు, అక్కడి ఐడీ కార్డ్ చూపించాల్సిందిగా ఆమె అతనిని కోరగా.. అతను సమాధానం దాటవేశాడు. ఆ తర్వాత ఏదో హాస్పటిల్ పేరు చెప్పి తప్పించుకున్నాడు. అతని చర్యలు కాస్త అనుమానం కలిగేలా ఉండటంతో యువతి ఆరా తీయడం మొదలుపెట్టింది.
లండన్ లో అతను చెప్పిన హాస్పిటల్ కి ఫోన్ చేసి ఆరా తీయగా.. అసలు ఆమె చెప్పిన వ్యక్తి ఎవరూ అక్కడ పనిచేయడం లేదని తేలింది. దీంతో అతను మోసం చేస్తున్నాడనే అనుమానం ఆమెకు కలిగింది.
గతంలో అతను ఆమెకు పంపిన ఫోటోపై ఫోటో స్టూడియో ఫోన్ నెంబర్ ఉండటాన్ని గమనించింది. వెంటనే ఆ నెంబర్ కి ఫోన్ చేయగా.. అతను పాకిస్థాన్ కి చెందిన వాడని.. అంతేకాకుండా అతనికి అప్పటికే పెళ్లి అయ్యి.. ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తెలిసింది.