
పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఒడిస్సీ నృత్యకారులు గురు మాయాధర్ రౌత్‌ను ఆయన నివాసం ఉంటున్న ప్రభుత్వ బంగ్లా నుంచి ఖాళీ చేయించారు. ఢిల్లీలోని Asian Games villageలోని ప్రభుత్వ బంగ్లాలో నివసిస్తున్న 91 ఏళ్ల గురు మాయధర్ రౌత్‌ను అధికారులు బయటకు పంపించారు. అయితే 2014లోనే ఆయన వసతిని రద్దు చేశామని.. ఖాళీ చేయించేందుకు అవసరమైన నోటీసులు అందజేశామని ప్రభుత్వం చెబుతుతోంది. అయితే ఈ నోటీసులపై ఆయన, ఇతర కళాకారులు కోర్టును ఆశ్రయించారు. అయితే కేసు ఓడిపోవడంతో.. బంగ్లాను ఖాళీ చేసి వెళ్లేందుకు ఏప్రిల్ 25 వరకు గడువు విధించారు.
అయితే రౌత్‌ను బంగ్లా నుంచి ఖాళీ చేయించిన తీరుపై ప్రస్తుతం విమర్శలు వెల్లువెత్తున్నాయి. వస్తువులను ఇంటి బయట పడవేయడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అలా బయట ఉన్న వస్తువుల్లో పద్మశ్రీ అవార్డు స్వీకరించిన సందర్భంగా ప్రశంస పత్రం కూడా ఉంది.
ఈ ఘటనపై రౌత్ కుమార్తె మధుమిత రౌత్ మాట్లాడుతూ.. తొలగింపు ప్రక్రియ చట్టబద్దమైనప్పటికీ.. జరిగిన తీరు అభ్యంతరకరంగా ఉందని చెప్పారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంలో కళాకారులకు గౌరవం లభించడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం 2014లో నిర్ణయం తీసుకుని ఉండవచ్చని.. అయితే 2020లో మాత్రమే కళాకారులకు తెలియజేశారని ఆమె అన్నారు. ప్రభుత్వ ఉద్దేశంపై కూడా ఆమె ప్రశ్నలు లేవనెత్తారు.
తాను బహిష్కరణకు వ్యతిరేకం కాదని మధుమిత చెప్పారు. అయితే బంగ్లాను ఖాళీ చేయించే సమయంలో తాను తన తండ్రితో ఉన్నానని.. లేకపోతే ఆయన చనిపోయి ఉండవచ్చని ఆమె చెప్పారు. మధ్యాహ్నం ఒంటి గంటల సమయంలో తన తండ్రికి ఆహారం వడ్డిస్తున్న సమయంలో.. అధికారులు వచ్చారని తెలిపారు. ఇంట్లో ఉండేందుకు రెండు నిమిషాలు సమయం లేదని అన్నారని చెప్పారు. ఆ వెంటనే కార్మికులు, పోలీసులు వచ్చి ఇంట్లోని సామాగ్రిని బయట విసిరేయడం చేశారని.. ఇది చూసి తన తండ్రి షాక్ తిన్నారని తెలిపారు.
అధికారులు తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని.. ఆర్డర్‌ను చూపాలని డిమాండ్ చేయడంతో వారికి ఏం చెప్పాలో తెలియలేదని మధుమిత అన్నారు. ‘‘మా రివ్యూ పిటిషన్ రేపటికి కోర్టులో జాబితా చేయబడినందున మరొక రోజు వేచి ఉండమని నేను వారిని అభ్యర్థించాను. అయితే వారు నిరాకరించారు’’ అని ఆమె చెప్పారు.
‘‘ఆయన ఇన్నాళ్లూ ఈ దేశానికి సేవ చేసాడు. శిష్యులకు బోధించాడు. ఆయన సేవల ద్వారా రూపాయి సంపాదించలేదు. ఆయనకు ఎక్కడా ఆస్తి గానీ.. భూమి గానీ.. లేదు. ఆయన బ్యాంక్ ఖాతాలో కేవలం ₹ 3,000 ఉంది. మీరు ఇలా ఎలా చేయగలరు? అతన్ని బయటకు విసిరేస్తారా?’’ అని ప్రశ్నించారు. ఇలాంటిది ప్రపంచంలో మరెక్కడా జరగదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, రౌత్ బంగ్లాను ఖాళీ చేయించిన కేంద్రం.. మరో ఎనిమిది మంది ప్రముఖ కళాకారులను మే 2లోగా వారి సౌకర్యాలను ఖాళీ చేయాలని కోరింది.
ఈ ఘటనకు సంబంధించి కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ది వ్యవహారాల మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. 28 మంది కళాకారులలో దాదాపు ఎనిమిది మంది అనేకసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ తమ ప్రభుత్వ వసతి గృహాల నుంచి బయటకు వెళ్లలేదని తెలిపారు. ‘‘ఈ ఎనిమిది మంది కళాకారులు వారి బంగ్లాలను ఖాళీ చేసే పనిలో ఉన్నారని.. ఇందుకు మరికొంత రోజులు కావాలని వారు మమ్మల్ని కోరారు. మే 2వ తేదీలోగా సౌకర్యాలను ఖాళీ చేస్తామని వారు మాకు వ్రాతపూర్వకంగా హామీ ఇచ్చారు.. అప్పటి వరకు మేము వారికి సమయం ఇచ్చాము’’ అని ఆ అధికారి పీటీఐ వార్తా సంస్థకి తెలిపారు.