యడ్యూరప్పకు తలనొప్పి: రేసులో 70 మంది ఎమ్మెల్యేలు

By telugu teamFirst Published Jul 25, 2019, 1:35 PM IST
Highlights

మంత్రివర్గ కూర్పులో మాత్రం యడ్యూరప్పకు చిక్కులు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కర్ణాటక మంత్రివర్గాన్ని ముఖ్యమంత్రితో పాటు 34 మందికి పరిమితం చేయాల్సి ఉంటుంది. ఈ 34 పదవులకు దాదాపు 70 మంది రేసులో ఉన్నారు.

బెంగళూరు: జెడిఎస్ నేత కుమారస్వామి ప్రభుత్వాన్ని కూల్చడంలో విజయం సాధించిన బిజెపి నేత, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పకు సొంత పార్టీ నుంచి తలనొప్పి ఎదురయ్యే అవకాశం ఉంది. కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేయడం దాదాపుగా ఖాయమై పోయిందని అంటున్నారు. బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షాతో భేటీ అయిన తర్వాత అధికారికంగా ఆ విషయం వెల్లడి కానుంది. 

మంత్రివర్గ కూర్పులో మాత్రం యడ్యూరప్పకు చిక్కులు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కర్ణాటక మంత్రివర్గాన్ని ముఖ్యమంత్రితో పాటు 34 మందికి పరిమితం చేయాల్సి ఉంటుంది. ఈ 34 పదవులకు దాదాపు 70 మంది రేసులో ఉన్నారు. బిజెపి సీనియర్ శాసనసభ్యులు 50 మంది మంత్రి పదవులు ఆశిస్తున్నారు. అదే సమయంలో తనకు సహకరించిన కాంగ్రెసు - జెడిఎస్ రెబెల్స్ 15 మందిని ఆయన సంతృప్తి పరచాల్సి ఉంటుంది. 

తొలుత ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారని, ఆ తర్వాతనే మంత్రి ఏర్పాటు ఉంటుందని అంటున్నారు. రెండు సార్లు, మూడు సార్లు గెలిచిన ఎమ్మెల్యేలు దాదాపు 56 మంది బిజెపిలో ఉన్నారు. వారంతా మంత్రివర్గంలో చోటును ఆశిస్తున్నారు. అదే సమయంలో 15 మంది జెడిఎస్- కాంగ్రెసు రెబెల్స్ లో కొంత మందిని మంత్రివర్గంలోకి తీసుకోవాల్సి ఉంటుంది. 

మంత్రివర్గంపై ఇప్పటికిప్పుడు యడ్యూరప్ప నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదని, తన జాబితాను అమిత్ షాకు పంపించి, తుది కూర్పును ఆయనకే వదిలేస్తారని పార్టీ వర్గాలంటున్నాయి. 

యడ్యూరప్పకు మరో విషయం కూడా తలనొప్పిగా మారే అవకాశం ఉంది. మంత్రివర్గంలోకి తన విధేయులను మాత్రమే కాకుండా బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ వర్గీయులను కూడా మంత్రివర్గంలోకి తీసుకోవాల్సి ఉంటుంది. 

కర్ణాటక బిజెపి దిగ్గజాలు జగదీష్ షెట్టర్, ఆర్ అశోక, కెఎస్ ఈశ్వరప్ప, బీ శ్రీరాములు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారు. కాంగ్రెసు రెబెల్ బెలగావి రమేష్ జర్కిహోలీ కూడా డిప్యూటీ సిఎం పదవిపై కన్నేశారు. 

యడ్యూరప్ప మంత్రివర్గంలో యువతకు చోటు కల్పించాలని బిజెపి జాతీయ నాయకత్వం భావిస్తోంది. సిఎన్ అశ్వత్థనారాయణ, వి సునీల్ కుమార్, సీటీ రవిల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. యడ్యూరప్ప విధేయుల్లో అరవింద్ లింబవల్లి, ఎంపి రేణుకాచార్య, హర్టాల్ హలప్ప, గోవింద్ కార్జోల్, అశోకలను ఎలా సంతృప్తి పరుస్తారనేది ప్రశ్నే. 

ముగ్గురు మహిళా ఎమ్మెల్యేలు జొల్లే శశికల అన్నాసాబెహ్, కె. పూర్ణిమ, రూపాలి సంతోష్ నాయక్ ల్లో ఒక్కరికి మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎమ్మెల్సీల్లో ఓ మహిళకు మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంటుందనేది పార్టీ అభిప్రాయం. గతంలో మంత్రులుగా పనిచేసిన 31 మందిని యడ్యూరప్ప ఈసారి తీసుకునే అవకాశం లేదు. అయితే, వారు అసంతృప్తికి గురి కాకుండా చూసుకోవాల్సిన అవసరం మాత్రం ఆయనకు ఉంటుంది.

click me!